మొదటిసారిగా మేడారంలో భక్తులకు ఇప్పపువ్వు లడ్డు

  • భక్తులు మెచ్చిన ఇప్పపువ్వు లడ్డు
  • మార్కెట్ లో మంచి డిమాండ్
  • మేడారం వేదికగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇప్ప పువ్వు లడ్డులు పంపిణీ.
  • జనవరి 13 న మేడారం వేదికగా లడ్డు విక్రయ స్టాల్స్ ప్రారంభం
  • ఇప్పటి వరకు రూ. 3 లక్షల వ్యాపారం
  • మేడారం పరిసరాలలో 10 స్టాల్స్ ఏర్పాటు.
  • సమ్మక్మ సారలమ్మ మహిళా రైతు ఉత్పత్తుల సంఘం ఆధ్వర్యం లో తయారీ
  • గిరిజన మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళా గా పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్ట పొందిన మేడారం మహా జాతరలో మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా గిరిజన మహిళ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో తయారుచేసిన అత్యంత పోషకాలు కలిగిన ఇప్పపువ్వు లడ్డు మేడారం వచ్చే భక్తులకు అందుబాటులో ఉంది.

అధిక ప్రయోజనాలు
ఇప్పపువ్వు లడ్డు తినడం ద్వారా అధిక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెప్తున్నారు. జీర్ణ క్రియ మెరుగుపడడం రోగ నిరోధక శక్తిని పెంచడం గుండె కొలెస్ట్రాల్ తగ్గించడం అధిక శక్తిని పొందడం బరువు నియంత్రణ తో పాటు డయాబెటిస్ తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు పూర్వకాలంలో ఆదివాసి గిరిజనులు ఇప్పపువ్వును అనేక వ్యాధులకు ముందుగా ఉపయోగించేవారు అని ఇప్పటికీ గుత్తి కోయ గూడాలలో వారి పిల్లలకు ఇప్పపువ్వు కుడుములు లడ్డూలు తినిపియడం ద్వారా పిల్లలు పౌష్టికంగా బలంగా ఉంటారని గిరిజనులు చెప్తున్నారు.

గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు
గర్భిణీ స్త్రీలు ఇప్పప్పు లడ్డు తినడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్ విటమిన్లు ఖనిజాలు పోషకాలు గర్భిణీ స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుందని పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా జన్మిస్తారని చెప్తున్నారు.

గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా
గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది దానిలో భాగంగానే ఇప్పపువ్వు లడ్డు తయారీ ద్వారా గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమం ద్వారా గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ద్వారా 12 మంది గిరిజన మహిళలతో ప్రత్యేకంగా సమ్మక్క సారలమ్మ మహిళ రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటుచేసి వీరికి రాష్ట్ర గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తి గ్రామంలో ఉట్నూర్ ఐటిడిఏ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఇప్పపువ్వు లడ్డు తయారీ మరియు క్రయ విక్రయాల గురించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శిక్షణ అందించారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం లో ఇప్పపువ్వు లడ్డు తయారీ యూనిట్ ను ప్రారంభించడం జరిగింది. ఈసం మంగవేణి, ఇర్ప మంజుల , ఇర్ప మౌనిక,ఈసం సాంబలక్ష్మి, ఈసం వరలక్ష్మి వీరి ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ మహిళ రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటు చేసి ఎంఎస్ఎమ్ఈ లో రిజిస్ట్రేషన్ చేసి ప్రత్యేకంగా ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కన్నేపల్లి గ్రామం నుంచి చెరుప నాగమణి, గొండి అనురాధ, గొండి మాణిక్యం, గొండి స్వరూప వీరి ఆధ్వర్యంలో సార్ వాళ్ళ అమ్మ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఫుడ్ లైసెన్స్ పొందడం జరిగింది.

మేడారం మహా జాతర వేదికగా జనవరి 13వ తేదీన ఇప్పపువ్వు లడ్డు స్టాల్స్ లను స్థానిక మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించింది.ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారుగా 3 లక్షల రూపాయల వ్యాపారం జరిగిందని నిర్వాహకులు చెప్తున్నారు.ప్రారంభించిన నాటి నుంచి భక్తుల నుంచి ఇప్ప పువ్వు లడ్డుకు మంచి ఆదరణ లభించడంతోపాటు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా నెలకొంది. ఈనెల 18వ తేదీన జరిగిన మంత్రుల క్యాబినెట్ సమావేశంలో ఇప్పపువ్వు లడ్డులను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో పాటు అధికారులకు పంపిణీ చేశారు. మేడారం వచ్చే భక్తులకు జాతర పరిసరాలలో పది స్టాల్స్ ఏర్పాటు చేశామని ఒక బాక్స్ లో 250 గ్రాములతో 150 రూపాయలకు అందుబాటులో ఉంటుందని , మాకు సహకరిస్తున్న స్థానిక మంత్రి అనసూయ సీతక్క గారికి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గారికి, డి ఆర్ డి ఏ అధికారులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇప్పపువ్వు లడ్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని లడ్డు రుచి కూడా అమోఘంగా ఉందని గర్భిణీ స్త్రీలు ఎంతగానో ఉపయోగిస్తున్నారని కొనుగోలుదారులు చెప్తున్నారు.