- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ – 2025 అవార్డులు ప్రదానం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ 2024 సంవత్సరంలో తొలిసారిగా ప్రారంభించిన “గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్” కార్యక్రమంలో భాగంగా, 2025 సంవత్సరానికి గాను ఎంపికైన వ్యక్తులు మరియు సంస్థలకు ఈ రోజు అవార్డులు ప్రదానం చేశారు. 2025 సంవత్సరానికి మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ & మెడికల్ ఫిలాంత్రపీ, కార్పొరేట్ వాలంటీరింగ్ అనే నాలుగు విభాగాలలో విశిష్ట స్వచ్ఛంద సేవలు అందించిన వ్యక్తులు మరియు సంస్థలను గుర్తించి ఈ గౌరవ పురస్కారాలు అందజేయబడ్డాయి. సంబంధిత రంగాలలో ఉత్తమ సేవలు అందించిన అభ్యర్థుల నుంచి నవంబర్ 2025లో ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాలలో నామినేషన్లు స్వీకరించబడ్డాయి. ప్రముఖులతో ఏర్పాటు చేసిన అవార్డుల ఎంపిక కమిటీ ఈ నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. ఈ కమిటీకి భారత ప్రభుత్వ మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చైర్మన్ శ్రీ కె. పద్మనాభయ్య, ఐ.ఏ.ఎస్. (రిటైర్డ్) గారు అధ్యక్షత వహించగా, ఇతర సభ్యులుగా సి.ఆర్. బిశ్వాల్, ఐ.ఏ.ఎస్. (రిటైర్డ్), డా. సునీతా కృష్ణన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, డా. చిన్నబాబు సుంకవల్లి, రమేష్ కాజా, జె. భవానీ శంకర్, జాయింట్ సెక్రటరీ టు గవర్నర్ ఉన్నారు.
2025 సంవత్సరానికి అవార్డులు పొందినవారి వివరములు:
• వ్యక్తులు (INDIVIDUALS):
- మహిళా సాధికారత – శ్రీమతి రమాదేవి కన్నెగంటి, హైదరాబాద్
గ్రామీణ మరియు పేద మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ, స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పించే సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేసి మహిళా సాధికారతకు విశేష సేవలు అందించారు. - గిరిజన అభివృద్ధి – శ్రీ తోడసం కైలాస్, వాఘాపూర్, ఆదిలాబాద్ జిల్లా
గోండీ భాషను పునరుజ్జీవింపజేస్తూ మహాభారతాన్ని నాలుగు నెలల్లో అనువదించడం, సుమారు 400 గిరిజన జానపద గీతాలు రచించడం ద్వారా గిరిజన సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేశారు. - రూరల్ హెల్త్ & మెడికల్ ఫిలాంత్రపీ – డా. ప్రద్యుత్ వాఘ్రే, హైదరాబాద్
కైలాస్‌నాథ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ పేదలకు ఛాతీ వ్యాధుల చికిత్సను సులభతరం చేసి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. - కార్పొరేట్ వాలంటీరింగ్ – శ్రీ వి. రాజన్న, హైదరాబాద్
సంస్థాగత సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ సమాజ సేవలో కార్పొరేట్ బాధ్యతను బలోపేతం చేశారు.
• సంస్థలు (ORGANIZATIONS):
- మహిళా సాధికారత – శ్రీ సాయి సోషల్ ఎంపవర్‌మెంట్ సొసైటీ, ఘట్‌కేసర్
గ్రామీణ, పట్టణ మరియు గిరిజన మహిళలకు నైపుణ్య శిక్షణలు అందించి, ఇంటి ఆధారిత ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వేలాది కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది. - గిరిజన అభివృద్ధి – Indigenous Development Organisation (IDO), గట్టుమల్ల (వి), భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా
వైద్యం, విద్య, పోషణ మరియు సమాజాభివృద్ధి కార్యక్రమాల ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను సమగ్రంగా మెరుగుపరుస్తోంది. - రూరల్ హెల్త్ & మెడికల్ ఫిలాంత్రపీ – రామదేవ్‌రావు హాస్పిటల్, హైదరాబాద్
ఆరోగ్య శిబిరాలు, పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలు, టీకాలు, ఉచిత శస్త్రచికిత్సల ద్వారా సేవలు అందించి గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. - కార్పొరేట్ వాలంటీరింగ్ – Give for Society, ఘట్‌కేసర్
మహిళల ఆరోగ్యం, పాఠశాల మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, వైద్య శిబిరాలు మరియు విపత్తు సహాయ కార్యక్రమాల్లో చురుకైన సేవలు అందిస్తోంది.
ప్రతి అవార్డుకు రూ.2,00,000/- నగదు బహుమతి మరియు అవార్డు గ్రహీతల విశిష్ట సేవలను గుర్తించే ప్రశంసా పత్రాన్ని గవర్నర్ ఈరోజు లోక్ భవన్, హైదరాబాద్‌లో నిర్వహించిన ‘AT HOME’ కార్యక్రమంలో ప్రదానం చేశారు.