సర్వసత్తాక సౌర్వభౌమిక దేశం మన భారతదేశం: తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి

ప్రజా స్వామ్య వ్యవస్థలో భాగంగా సర్వసత్తాక సౌర్వభౌమిక దేశం మన భారతదేశం అని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారంనాడు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి కార్యాలయంలో 77వ గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 1947లో స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలకు సంక్షేమ, అభివృద్ది ఫలాలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో డా.బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్నిరచించారు. రాజ్యాంగం 1950 జనవరి, 26వ తేదీ నుండి అమలులోకి వచ్చిందన్నారు. ప్రతి మనిషికి జీవించే హక్కు, వైద్య, విద్యా హక్కు, రక్షణ వ్యవస్థ, చట్టాలు, మొదలగు అంశాల గురించి రాజ్యాంగంలో పొందుపర్చారని ఆయన వివరించారు. దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థ మూలం అన్నారు. మన రాజ్యాంగం రూపొందించిన ప్రకారం దేశంలోని కోట్ల మంది ప్రజలు తమ మత విశ్వాసాలు, మతాల అనుశాసనం ప్రకారం ఎవ్వరికి నచ్చిన మతాన్ని వారు ఆచరిస్తున్నారని తెలిపారు. మన రాజ్యాంగ స్పూర్తితో మన దేశంలో అందరికి సమాన హక్కులు, కుల, మత, లింగ, వర్ణ భేదాలు లేకుండా ప్రపంచంలో పరిపాలన అందిస్తున్న ఎకైక దేశం మన దేశమే అన్నారు.

ఆ నాడు దళిత వర్గాలకు, పేద వర్గాలకు నష్టం వాటిల్ల కుండా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆ నాడే ఆలోచించి అందిరికి తగిన న్యాయం జరిగేలా రాజ్యాంగంలో పేర్కొన్నారని తెలిపారు. అదే విధంగా దేశంలో కులాలు, మతాలు, ఎవరి విశ్వాసాలు వారికి ఉన్నా దేశంలోని పౌరులంతా భారతీయులే అని మన రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని ఆయన వివరించారు. మనం ఈ రోజు కుల, మత వివక్ష లేకుండా అందరం కలిసి మెలసి జీవిస్తున్నామంటే రాజ్యాంగం మనకు కల్పించిన సమాన హక్కులు, అవకాశాలు మాత్రమే అని అన్నారు. ఈ ఫలాలు రాబోయే మన ముందు తరాలకు కూడా అందాలని ఆయన ఆకాక్షించారు. అదే విధంగా తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమం, శిక్షణా తరగతుల ద్వారా జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలు పెంపొందించడానికి కృషి చేయాలని అన్నారు. రాబోయే రోజులలో జర్నలిస్టుల సంక్షేమం, జర్నలిస్టుల శిక్షణా కార్యక్రమాల నిర్వహణ ద్వారా తెలంగాణ మీడియా అకాడమి దేశంలోనే మొదటిస్థానంలో ఉండేలా అకాడమి సిబ్బంది అందరం కలిసి పని చేద్దాం అని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వర రావు, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణ చందర్ రావు, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, ఎమ్.కె. రహమాన్, తదితరులు పాల్గొన్నారు.