ఏసీబీ అధికారుల మెరుపు దాడులు..

  • అవినీతి అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువ
  • ఆదాయానికి మించిన అక్రమస్తులు..
  • హోంగార్డు ఆస్తులు రూ.20 కోట్లు
  • ఏసీబీ అధికారుల దాడుల గురించి ముందుగానే సమాచారమిచ్చి డబ్బుల వసూలు

ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారిలో అక్రమాస్తులు కూడబెట్టి అడ్డంగా దొరికిపోయిన ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చూట చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు వాళ్లు చేస్తున్న ఉద్యోగానికి వెనకేసిన అక్రమ సంపాదనకు పొంతనే ఉండదు. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం అవినీతి అధికారులపై మెరుపు దాడులు జరిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఒకే రోజు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఓ హోంగార్డు, చిత్తూరు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులే లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఓ హోంగార్డు భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన ఘటన హాట్‌ టాపిక్‌గా మారింది. విజయనగరం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయనగరం, గుర్ల, విశాఖపట్నం ప్రాంతాల్లోని శ్రీనివాస రావు నివాసాల్లో తనిఖీలు చేసి, సుమారు రూ.20 కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు. శ్రీనివాసరావు ఏసీబీలో 15 ఏళ్లు పనిచేసి అధికారుల దాడుల గురించి ముందుగానే సమాచారమిచ్చి డబ్బులు తీసుకునేవాడని, అవినీతి ఆరోపణలు రావడంతో అతడిని పోలీస్‌ కార్యాలయానికి బదిలీ చేశారని ఏసీబీ అధికారులు వెల్లడించారు. హోంగార్డు శ్రీనివాసరావు ఇంటితోపాటు అతడి సన్నిహితులు, బంధువుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. సాధారణ హోంగార్డు ఉద్యోగం చేసే వ్యక్తి ఇంత భారీ మొత్తంలో ఆస్తులు సంపాదించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏసీబీ బృందాలు రికార్డులను పరిశీలిస్తున్నాయి.

గ్రేడ్-2 ఉద్యోగి ఆస్తులపై..
మరో ఆపరేషన్‌లో భాగంగా.. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గ్రేడ్-2 ఉద్యోగిగా పనిచేస్తున్న నల్లపోగు తిరుమలేశ్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక సాధారణ గ్రేడ్-2 ఉద్యోగి హోదాలో ఉండి, కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంపాదించారనే ఫిర్యాదులతో అధికారులు ఈ సోదాలు చేపట్టారు.
రేణిగుంట, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఏసీబీ ఏఎస్పీ(ASP) విమలకుమారి నేతృత్వంలో మొత్తం ఐదు బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. తిరుపతిలో తిరుమలేశ్ నివాసంతో పాటు మరో రెండు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలం డీసీ పల్లెలోని ఆయన స్వగృహం, బంధువుల ఇళ్లలో అధికారులు పత్రాలను పరిశీలిస్తున్నారు.

దాడుల వెనుక ప్రధాన కారణాలు..
ఏపీలో అధికారుల అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. కింది స్థాయి నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా సోదాలు నిర్వహించారు.

ఆదాయానికి మించిన అక్రమస్తులు..
జీతానికి మించిన విలాసవంతమైన జీవితం, స్థిరాస్తుల కొనుగోలుపై నిఘా ఉంచిన అధికారులు ఈ సోదాలు చేశారు. తమ పేరు మీద కాకుండా బంధువుల పేరు మీద ఆస్తులు రిజిస్టర్ చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సోదాల్లో భాగంగా భారీగా నగదు, బంగారు ఆభరణాలు, భూములకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న పత్రాల విలువ, బ్యాంకు లాకర్ల వివరాలు, ఇతర బినామీ ఆస్తుల లెక్క తేలాల్సి ఉంది. సోదాలు పూర్తయిన తర్వాత ఎంత విలువైన ఆస్తులు పట్టుబడ్డాయనే విషయాన్ని ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.