సమ్మక్క–సారక్క జాతరకు జాతీయ పండుగ గుర్తింపు కోసం కేంద్రానికి విజ్ఞప్తి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న రెండో సమ్మక్క–సారక్క జాతర ఇదేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తుల సౌకర్యార్థం అనేక శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మేడారంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సమ్మక్క–సారక్క జాతరను ‘జాతీయ పండుగ’గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల పర్యటనతో ఈ అంశం త్వరలోనే సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మక్క–సారక్క జాతరను గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, మరో కుంభమేళాగా ఆయన అభివర్ణించారు. ఈ మహాజాతర విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషి చేసిన అధికారులు, సిబ్బంది మరియు సహకరించిన మీడియా మిత్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సూచనల మేరకు ఇన్‌ఛార్జ్ మంత్రి పర్యవేక్షణలో కేవలం 90 రోజుల్లోనే ఆలయ అభివృద్ధి పనులు మరియు మౌలిక వసతులు పూర్తి చేసినట్లు తెలిపారు. సాధారణంగా నాలుగు రోజులపాటు జరిగే జాతరను, ఈసారి భక్తుల రద్దీ దృష్ట్యా విస్తృత ఏర్పాట్లతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు జాతర ప్రశాంతంగా, సవ్యంగా కొనసాగుతోందని పేర్కొంటూ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, ఇతర జిల్లాల నుంచి వచ్చి సేవలందించిన సిబ్బంది మరియు సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గద్దెల పునర్నిర్మాణం సహా మౌలిక సదుపాయాల పనులు నిర్ణీత కాలంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరంకి విజ్ఞప్తి చేసినట్లు, అలాగే జాతర నిర్వహణకు మరింత ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తులు హాజరవుతున్న ఈ మహాజాతరలో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంటూ, జాతర విజయవంతానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు మరియు మీడియా మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.