పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తుంది
  • నివాస ప్రాంతాల్లోని పరిశ్రమలతో భద్రత, ఆరోగ్య ప్రమాదాలు
  • గాలి నాణ్యత పర్యవేక్షణకు రాష్ట్రంలో 40 కొత్త స్టేషన్లను ఏర్పాటు చేశాం
  • త్వరలో గాలి నాణ్యత డాష్ బోర్డులను ప్రారంభిస్తాం
  • కాలుష్య ఫిర్యాదులపై వేగంగా స్పందించేందుకు ప్రత్యేక బృందాలు

పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది అందుకే ఈ విషయంలో
తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తుందనీ హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం (mcrdh)లో “గాలి నాణ్యత సూచీ మరియు గాలి నాణ్యత నిర్వహణ” అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సదస్సు యొక్క స్పష్టమైన, ఉన్నత లక్ష్యం ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం స్వచ్ఛమైన గాలి అన్నారు. నేడు తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి, హైదరాబాద్ ఐటీ, లైఫ్ సైన్సెస్, తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా ఎదిగింది, ఈ అభివృద్ధి మనకు గర్వకారణం అని తెలిపారు. అదే సమయంలో ఇది మనపై బాధ్యతను కూడా మోపుతుంది అన్నారు. అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణను ఎదురెదురుగా నిలబెట్టలేం, అవి చేతులు కలిపి ముందుకు నడవాలి అని డిప్యూటీ సీఎం అన్నారు. సుస్థిర అభివృద్ధి ద్వారా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తోందనీ తెలిపారు. అదే సమయంలో జలాశయాల పునరుద్ధరణ, సహజ వనరుల సంరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలపై కూడా తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందనీ డిప్యూటీ సీఎం తెలిపారు. ఎందుకంటే శుభ్రమైన గాలి లేకుండా జరిగే అభివృద్ధి నిజమైన ప్రగతి కాదు, అది కేవలం ఆలస్యమైన నష్టం మాత్రమే అని వివరించారు. గాలి నాణ్యత ఒక పర్యావరణ సూచీ మాత్రమే కాదు, అది ప్రజారోగ్య సూచీ, అది ఉత్పాదకత సూచీ మరియు అది ఆర్థిక సూచీ కూడా అన్నారు. 2024 ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్’ సహా ప్రపంచ స్థాయి అధ్యయనాలు ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయి అని తెలిపారు.

నేడు గాలి కాలుష్యం, అధిక రక్తపోటు తర్వాత, ప్రపంచంలో మరణాలకు రెండో ప్రధాన కారణంగా మారిందనీ, ప్రతి ఏడాది 80 లక్షలకు పైగా అకాల మరణాలకు ఇది కారణమవుతోంది అన్నారు. ఇది మన పిల్లలను, వృద్ధులను, పని చేసే జనాభాను తీవ్రంగా ప్రభావితం చేస్తోందనీ అన్నారు. ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ప్రకారం, గాలి కాలుష్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా నాలుగు ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతోంది,
అందుకే శుభ్రమైన గాలి గురించి మాట్లాడినప్పుడు, మనం మనుషుల జీవితాల గురించి,
ఆర్థిక బలంపై, సామాజిక శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నాం అన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా ఇప్పటికే గుర్తింపు పొందింది, ఇది మనందరికీ గర్వకారణం, కానీ అదే సమయంలో మన నగర వ్యవస్థలు కూడా అంతే వేగంగా పరిపక్వం చెందాలి అని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రభుత్వం లక్ష్యాధారితమైన, శాస్త్రీయమైన విధానాన్ని అనుసరిస్తోంది అందులో భాగంగా మొదటి అంశం పర్యవేక్షణ (Monitoring).

మా నమ్మకం చాలా స్పష్టం: మనకు కొలవలేని దాన్ని మనం నిర్వహించలేం. 2024లో గాలి నాణ్యత పర్యవేక్షణ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 40 కొత్త స్టేషన్లను ఏర్పాటు చేశాం. దీని ద్వారా రియల్‌టైమ్, విశ్వసనీయ డేటా అందుతుందని తెలిపారు.
రెండోది — ప్రణాళిక (Planning): 2025లో రాష్ట్ర గాలి శుభ్రత కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. వాహనాలు, రోడ్డు ధూళి, నిర్మాణాలు, పరిశ్రమలు, బహిరంగ దహనం వంటి ప్రధాన కాలుష్య మూలాలను ఈ ప్రణాళిక పరిష్కరిస్తోంది. ఇది ఇప్పటికే అమలులో ఉందనీ తెలిపారు.
మూడోది– స్వచ్ఛమైన రవాణా (Clean Mobility): ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు అందిస్తున్నాం. ఈ-బస్సులు, మెట్రో విస్తరణ ద్వారా ప్రజా రవాణాను బలోపేతం చేస్తున్నాం.
రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులు నిర్మిస్తున్నాం. పాత, కాలుష్యకర వాహనాలను తొలగించేందుకు రిజిస్టర్డ్ వాహన స్క్రాపింగ్ కేంద్రాలను ప్రారంభించాం అని వివరించారు.
నాలుగోది — పరిశ్రమల నియంత్రణ: పరిశ్రమల ఉద్గారాలను నిరంతర పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా కాలుష్య నియంత్రణ మండలి సర్వర్లకు అనుసంధానించాం,
శుభ్రమైన ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం, నియమావళి అమలును కఠినతరం చేస్తున్నాం అని వివరించారు.
ఐదోది — పునరుత్పాదక శక్తి: 2025 పునరుత్పాదక శక్తి విధానం ద్వారా 2030 నాటికి 20,000 మెగావాట్ల లక్ష్యాన్ని నిర్దేశించాం, సౌర, గాలి, గ్రీన్ హైడ్రజన్ ద్వారా. ఇది కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందనీ డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రమాదాలను కూడా మనం గుర్తించాలి,
కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు సుమారు 32 శాతం కాలుష్యానికి కారణమవుతున్నాయని ప్రజెంటేషన్ వెల్లడించిందనీ తెలిపారు. నేరుగా వచ్చే ధూళి కణాలపై నియంత్రణ ఉన్నప్పటికీ, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వంటి ఇతర కాలుష్యాలపై మరింత దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది అన్నారు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం ఉదాహరణగా మనం చూశాం, ఒకప్పుడు నగర చివరన ఉన్న పరిశ్రమలు నేడు నివాస ప్రాంతాల మధ్య ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు ORR లోపల అనేక ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉన్నాయి అన్నారు. ఇది రాష్ట్ర ప్రజల భద్రత, ఆరోగ్య పరంగా తీవ్రమైన ప్రమాదాలను సృష్టిస్తుంది అని పేర్కొన్నారు. నివాస ప్రాంతంలో జరిగే పరిశ్రమల ప్రమాదం పెద్ద విపత్తుగా మారవచ్చు అన్నారు. కాబట్టి పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ, జోనింగ్ సంస్కరణలు, మెరుగైన భూ వినియోగ ప్రణాళికలను తీవ్రంగా పరిశీలించాలి అన్నారు. నగర వృద్ధి ప్రణాళికతో జరగాలి,
అదృష్టవశాత్తూ కాదు, ముందుకు వెళ్లే క్రమంలో పాలన వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నాం, ప్రజలకు అందుబాటులో ఉండే గాలి నాణ్యత డ్యాష్‌బోర్డును త్వరలో ప్రారంభించాలని భావిస్తున్నాం అని డిప్యూటీ సీఎం ప్రకటించారు.

కాలుష్య ఫిర్యాదులకు వేగంగా స్పందించేందుకు రెండు GHMC జోన్లలో ప్రత్యేక చర్యల బృందాలను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తాం, ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఆ కేంద్రాలను విస్తరిస్తాం అన్నారు. మా ప్రభుత్వం దృష్టికోణం కేవలం నియంత్రణ మాత్రమే కాదు, అది స్పందనాత్మకం కూడా కానీ నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఎంత నిబద్ధత కలిగిన ప్రభుత్వం అయినా, ఒంటరిగా శుభ్రమైన గాలిని అందించలేరు అన్నారు, శుభ్రమైన గాలికి భాగస్వామ్యం అవసరం అన్నారు. పౌరులతో, పరిశ్రమలతో, సంస్థలతో పౌర సమాజంతో భాగస్వామ్యం తప్పనిసరి అని డిప్యూటీ సీఎం తెలిపారు. స్వచ్ఛమైన గాలిని ఏర్పాటు చేసుకోవడానికి రోజువారీ చిన్న నిర్ణయాలు చాలా ముఖ్యం. ప్రజా రవాణా వినియోగించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, చెత్తను కాల్చకుండా ఉండడం, పచ్చ విధానాలకు మద్దతు ఇవ్వడం వంటివి విస్తృతంగా చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు. పర్యావరణ పరిరక్షణ ఇంటి నుంచే ప్రారంభమవుతుంది, మేము శుభ్రమైన గాలిని కేవలం పరిపాలనా బాధ్యతగా చూడటం లేదు, అది ఒక నైతిక బాధ్యతగా చూస్తున్నాం, మన పిల్లల పట్ల, భవిష్యత్ తరాల పట్ల, చరిత్ర పట్ల బాధ్యత గా భావిస్తున్నామని తెలిపారు. మన తెలంగాణను మనం ఎలా వదిలిపెట్టాలనుకుంటున్నాం? కాలుష్యంతో నిండిన ఊపిరితిత్తులు ఉన్న సంపన్న రాష్ట్రంగా? లేదా ఆరోగ్యవంతమైన పౌరులు ఉన్న ఆధునిక రాష్ట్రంగా? అని ప్రశ్నిస్తూనే మా సమాధానం స్పష్టం, ఈ సదస్సు జాతీయ, అంతర్జాతీయ నిపుణులను ఒక వేదికపైకి తీసుకొచ్చింది. వారి అనుభవం, డేటా, ఆవిష్కరణలు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి అన్నారు. సంబంధిత శాఖలన్నీ ఈ ఉత్తమ విధానాలను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా అధ్యయనం చేసి అమలు చేయాలని కోరుతున్నాను అని తెలిపారు. జ్ఞానాన్ని విధానంగా మార్చుదాం, విధానాన్ని చర్యగా మార్చుదాం, చర్యను ఫలితంగా మార్చుదాం అని పిలుపునిచ్చారు. ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలు, శుభ్రమైన గాలి కలిసి ముందుకు సాగే తెలంగాణను నిర్మిద్దాం, అదే మన నిజమైన వారసత్వం అని డిప్యూటీ సీఎం తెలిపారు.