- సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం.. మంత్రి జూపల్లి నివాళి
విధి నిర్వహణలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సౌమ్య కుటుంబ సభ్యులకు రూ.కోటి పరిహారం, ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఆదివారం సౌమ్య మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడికి వెళ్లిన మంత్రి జూపల్లి.. సౌమ్యకు నివాళులర్పించారు. ఎక్సైజ్ ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ.50 లక్షలను సౌమ్య కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని జూపల్లి తెలిపారు. విధి నిర్వహణలో సౌమ్య అంకిత భావాన్ని, ధైర్య సాహసాలను కొనియాడుతూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు. కాగా, సౌమ్య అంత్యక్రియలు నిజామాబాద్ జిల్లా మోస్రా లో ఆదివారం సాయంత్రం అధికార లాంఛనాలతో జరిగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివా్‌సరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్‌రావు, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎక్సైజ్ శాఖ జిల్లా ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, మోస్రా గ్రామ ప్రజ లు పెద్ద సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పోచారం శ్రీనివా్‌సరెడ్డి, సీపీ సాయి చైతన్య సౌమ్య పాడె మోశారు. తండ్రి సాయిలు సౌమ్య చితికి నిప్పంటించారు. గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారంతో గత నెల 23న నిజామాబాద్ శివారులో మాధవ నగర్ వద్ద ఓ కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా గంజా యి ముఠా సౌమ్యపైకి కారును పోనిచ్చింది. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సౌమ్యను గత నెల 25న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడుతూ శనివారం రాత్రి ఆమె కన్నుమూసింది. మోస్రాకు చెందిన సాయిలు, చంద్రకళ కూతురు సౌమ్య డిగ్రీ పూర్తికాగానే 2024లో తొలి ప్రయత్నంలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించింది. ఆమె తల్లిదండ్రులు స్థానిక అంగట్లో సరుకులు అమ్ముతూ జీవిస్తున్నారు.