- పరీక్ష లో సమయంలో ఒత్తిడికి లోను కావద్దు
- ఇష్టంగా చదవండి.. చదువు పేదరికాన్ని జయించే శక్తి ఇస్తుంది
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఇష్టంగా చదవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ శ్రీధర్ అన్నారు. బీసీ గురుకుల, హాస్టల్ విద్యార్థులకు 8వ తరగతి నుంచే ఇంగ్లీష్ లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ హాస్టల్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్, గురుకుల విద్యాసంస్థల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పరీక్షల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ భాషపై సరైన అవగాహన లేకపోవడమేనని పేర్కొన్నారు. విద్యార్థుల్లో చిన్న తరగతుల నుంచే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్‌ను పెంపొందించేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. 8 వ తరగతి నుంచే ఇంగ్లీష్‌పై పట్టు సాధిస్తే టెన్త్, ఇంటర్ దశలో పరీక్షల భయం తగ్గి మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే గురుకుల విద్యా విధానం మెరుగైనదని ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టం చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన వాతావరణం, నాణ్యమైన బోధన, వ్యక్తిగత శ్రద్ధ లభిస్తోందని అన్నారు. గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థుల అకడమిక్ ప్రగతితో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసం జరుగుతోందని, ఈ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. మహాత్మా జ్యోతిరావు పూలే సెక్రెటరీ బడుగు సైదులు మాట్లాడుతూ విద్యార్థులకు ఇంగ్లీషు, మ్యాథ్స్ శిక్షణ, ప్రత్యేక తరగతులు నిర్వహించి భవిష్యత్తులో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఆహార పదార్థాలు కల్తీ జరగకుండా సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వహించాలన్నారు . పేరెంట్స్ మీటింగ్ తప్పక పెట్టాలని , సొంత బిల్డింగ్ ఉన్న హాస్టల్లో మౌలిక సదుపాయాలు కావలసిన రిపేరు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఏ సంజీవ, ఉమ్మడి జిల్లాల ఆర్ సి వో స్వప్న , సంబంధిత శాఖాధికారులు, హాస్టల్ ఆఫీసర్లు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.