- యూరియా యాప్ పై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు
- తేనెటీగల పెంపకంతో అధికాదాయము పొందుతున్న రైతులను మరియు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను అభినందించిన మంత్రి
- రైతుల అవసరాల మేరకు మంగళవారం రైతునేస్తంలో అంశం నిర్ణయము, దానికి తగ్గ రైతు అనుభవాలు మరియు పొలాల నుండి ప్రత్యక్షంగా రైతులు వాటిని చూసేటట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్ : ఈ రోజు జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రైతులతో ముఖాముఖి ముచ్చటించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు తమ వ్యవసాయ అనుభవాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పథకాల వల్ల పొందుతున్న ప్రయోజనాలను మంత్రితో పంచుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా రైతు శివ గారు సమగ్ర వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం అంశాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. అలాగే ఇఫ్కో కంపెనీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ కృపా శంకర్ గారు నానో యూరియా వినియోగం, దాని ప్రయోజనాలు, సరైన వాడక విధానంపై రైతులకు సమగ్రంగా వివరించారు. పీజేటీఎస్ఏయూ (PJTSAU) నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ కిరణ్ బాబు గారు, డాక్టర్ అరుణశ్రీ గారు యాసంగి వరిలో వచ్చే పురుగులు, తెగుళ్లు మరియు వాటి సమర్థవంతమైన యాజమాన్యంపై రైతులకు శాస్త్రీయంగా వివరించారు. కార్యక్రమంలో భాగంగా యూరియా యాప్ అమలుపై మంత్రి స్వయంగా రైతులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. యాప్ ద్వారా ఎరువుల సరఫరా పారదర్శకంగా, సులభంగా జరుగుతుండటంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూరియా లభ్యత, సమయానికి సరఫరా వంటి అంశాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వారు తెలిపారు. తేనెటీగల పెంపకం చేస్తూ అధిక ఆదాయం సాధిస్తున్న జగిత్యాల జిల్లా పూడూరు గ్రామానికి చెందిన రైతు రామక్రిష్ణని, అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభాలు పొందుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు శివని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి వినూత్న వ్యవసాయ విధానాలను మరింత మంది రైతులు అనుసరించేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కంది కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి రైతులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేంద్రాల వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని, మధ్యవర్తుల బెడద తగ్గిందని రైతులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతుల అవసరాల మేరకు అంశాలను ముందుగానే నిర్ణయించాలి అని అధికారులకు సూచించారు. నిర్ణయించిన అంశాలకు అనుగుణంగా రైతుల అనుభవాలు, విజయగాథలను క్షేత్రస్థాయిలో – పొలాల నుంచే ప్రత్యక్షంగా ఇతర రైతులు చూసేలా ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతున్న తీరును, రైతులకు చేరువయ్యేలా అధికారులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు. అదే సమయంలో రైతుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఎక్కువ సంఖ్యలో రైతులు పాల్గొనేలా ముందస్తు ప్రచారం, సమన్వయం చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు రైతు నేస్తం వేదిక మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.