మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మేమున్నాం అనే భరోసా ఇచ్చి వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్న తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం అభినందనీయం అని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారంనాడు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ మరియు అకాడమి ప్రచురించిన చిరుపుస్తకాలు (మోనోగ్రాఫ్స్) ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావుతో కలిసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ మాట్లాడుతూ, అక్షరమే ఆయుధంగా క్షేత్రస్థాయిలో పని చేసే జర్నలిస్టులు అకాల మృతి చెందడం బాధాకరమన్నారు. మరణించిన జర్నలిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు మంజూరు చేయడంతోపాటు అయిదు సంవత్సరాల పాటు పెన్షన్ సదుపాయం కల్పించడం మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు తోడ్పడుతుందని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా పాత్రికేయ రంగంలో అనేక సంవత్సరాలు సేవలందించిన ప్రముఖ జర్నలిస్టు జీవిత విశేశాలు తెలిపే చిరు పుస్తకాలు (మోనోగ్రాఫ్స్) ఆవిష్కరించడం వలన రాబోయే తరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. నేటి సమాజంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా తను నేను మాత్రం పత్రికలు చదివితినే సంతృప్తి చేందుతానని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
విద్యా, ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు కె. కేశవ రావు మాట్లాడుతూ, ప్రముఖుల చరిత్ర తెలిపే పుస్తకం చదవడం సులభం. కాని అదే చరిత్ర ను మోనోగ్రాఫ్ గా అందించడం మాటలు కాదు. అది అక్షర రూపం దాల్చడంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సమాజానికి అద్దం పట్టేది వార్త అయితే ఆ వార్త వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసిన జర్నలిస్ట్ భవిష్యత్తు తరాలకు దారి చూపిన వారవుతారు. సోషల్ మీడియా ను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదన్నారు. కానీ దీనిపై మన జర్నలిస్టులందరూ ఎకతాటిపై వచ్చి చర్చించడం లేదా వర్క్ షాప్ లు నిర్వహించి కొంత మార్పుకు నాంది పలకాలన్నారు.
తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, చనిపోయిన 18 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ, ప్రమాదానికి గురైన జర్నలిస్టుకు 50 వేల ఆర్థిక సహాయం చెక్కును అందజేసినట్లు ఆయన వివరించారు. ప్రముఖ పాత్రికేయులైన 1. అబిద్ అలీఖాన్, 2. డి. సీతారాం, 3. బేతనబొట్ల నాగేశ్వరరావు, 4.పొత్తూరి వెంకటేశ్వరరావు, 5.ఎం.ఎస్.ఆచార్య, 6.ఎ.బి.కె. ప్రసాద్, 7.జి.ఎస్. వరదాచారి, 8.సి.రాఘవాచారి, 9.వి.హనుమంతరావు, 10.ఆదిరాజు వెంకటేశ్వరరావులపై మీడియా అకాడమి ప్రచురించిన 10 చిరుపుస్తకాలు (మోనోగ్రాఫ్స్) ఆవిష్కరణ చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, సీనియర్ జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
