- రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులకు 500 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తాం…
ఢిల్లీ: కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తాన్ని తామే భరిస్తామని ఇప్పటికే తెలియజేసిన విషయాన్ని సీఎం కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ మార్గంలోని టేకల్‌కోడ్ లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని.. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సీఎం కేంద్ర మంత్రికి తెలియజేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం వివరించారు.
హైదరాబాద్-చెన్నై (778 కి.మీ.), హైదరాబాద్-బెంగళూర్ (586 కి.మీ.), హైదరాబాద్-పుణే (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలియజేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలని ప్రారంభించాలని సీఎం సూచించారు. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతుందని, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. దాంతో డ్రైపోర్ట్ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతం అవుతుందని వివరించారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుందని సీఎం రైల్వే మంత్రికి వివరించారు. ఈ మూడు కారిడార్లకు భూ సేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించాలని రైల్వే శాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలత వ్యక్తం చేశారు. పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్.శ్రీనివాస రాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, కేంద్ర పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.