తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మకమైన 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరగబోయే బయోఏషియా-2026 సదస్సు ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనుంది.
🔹 ఈ ప్రపంచ స్థాయి సదస్సు ప్రధానంగా ‘టెక్‌బయో అన్‌లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్నారు. టెక్‌బయో ఇన్నోవేషన్స్‌లో దేశం గ్లోబల్ హబ్‌గా మారుతున్న తరుణంలో, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో లైఫ్ సైన్సెస్ రంగంలో భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ సంబంధించిన అంశాలపై ఈ సదస్సు చర్చించనుంది.
🔹 లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏర్పాటు చేసే అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. అనంతరం బయోఏషియా సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, బయో సైన్సెస్ రంగంలో నిష్ణాతులు ఆయా అంశాలపై ప్రసంగించనున్నారు.
🔹 పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్ గారు, అమెరికాకు చెందిన ఆమ్జెన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హోవర్డ్ వై చాంగ్ గారు కీలకోపన్యాసం చేయనున్నారు.
🔹 సైన్స్, సాఫ్ట్‌వేర్ అండ్ సప్లయ్, నెక్స్ట్ జనరేషన్ బయోలాజిక్స్, ఫార్మా, బయోటెక్ భవిష్యత్తు, ఏఐ, ఆర్ అండ్ డీ (డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్), గ్లోబల్ ఇంపాక్ట్, తెలంగాణ రైజింగ్ 2047 – వరల్డ్-క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ వంటి కీలక అంశాలపై జరిగే చర్చల్లో వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు పాల్గొంటారు.