- మక్తల్‌లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను జాతరలా నిర్వహించాలి
- ఈనెల 20 నుంచి 24 వరకు సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
- కలెక్టర్ పర్యవేక్షణలో అధికారులంతా సమన్వయం చేసుకొని కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలి
- 33 జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా ఏర్పాట్లు ఉండాలి
- కబడ్డీ పోటీల నిర్వహణను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
- కబడ్డీ పోటీల ఏర్పాట్లపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్‌లో సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను జాతరలా నిర్వహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మక్తల్‌లో ఈనెల 20 నుంచి 24 వరకు నిర్వహించే కబడ్డీ పోటీల నిర్వహణపై ప్రజాప్రతినిధులు, జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కప్-2026లో భాగంగా మక్తల్ పట్టణంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని, వీటిని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. కబడ్డీ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలని మంత్రి దిశానిర్ధేశం చేశారు. ఈనెల 20 నుంచి 24 వరకు కబడ్డీ పోటీలు జరుగనుండటంతో అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు సీరియస్‌గా తీసుకోని పనిచేయాలని ఆదేశించారు. మక్తల్ లో నిర్వహించే కబడ్డీ పోటీలు ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచేలా నిర్వహణ ఉండాలని అభిప్రాయపడ్డారు. అందుకోసం అతిథ్యం, స్టేడియం, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించాలని అధికారులకు మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు 33 జిల్లాలనుంచి క్రీడాకారులు రానుండటంతో అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చే వారికి వసతులు తదితర అంశాల్లో ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా చూసుకోవాలని తెలిపారు. క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులను కబడ్డీ పోటీల్లో భాగస్వాములను చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. ఈ కబడ్డీ పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అతిథులుగా హాజరవుతున్నారని, వారందరిని గౌరవించుకోవాలని సూచించారు. పోలీస్, స్పోర్ట్స్, శానిటరీ, మున్సిపల్, విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడూ జిల్లా ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ కబడ్డీ పోటీలను విజయవంతానికి కృషిచేయాలని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా కబడ్డీ పోటీలను సవాల్‌గా తీసుకోని అధికారులతో కలిసి ముందుకుపోవాలని మంత్రి చెప్పారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా క్రీడల అధికారి, విద్యుత్, మున్సిపల్ కమీషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవో అధికారులు, మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస హన్మంతులు పాల్గొన్నారు.