హైదరాబాద్ : రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సచివాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఐ.టి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కమిషనర్ శశాంక, ఐటి శాఖ ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సి.ఎస్ రామకృష్ణా రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు పూర్తి స్థాయిలో తగు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసారు. ఇప్పటికే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలు మార్లు డేటా సెంటర్ల ఏర్పాటుపై సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారని అన్నారు. డేటా కేంద్రాల ఏర్పాటుకు పొరుగు రాష్ట్రాలను మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ లతో పాటు ఉత్తరప్రదేశ్ లలో ఇస్తున్న రాయితీలపై చర్చించారు.
డాటా సెంటర్ల ఏర్పాటుకు 100 శాతం గ్రీన్ ఎనర్జీ సోర్స్ సౌకర్యం, కావాల్సిన విద్యుత్ ను బహిరంగ సేకరణ ద్వారా పొందడం, డెడికేటెడ్ పవర్ సప్లై నెట్వర్క్ ఎస్.జి.ఎస్.టి రీ-ఇంబర్సుమెంట్ తదితర అభ్యర్థనలు డేటా సెంటర్ల ఇన్వెస్టర్లు కోరుతున్నందున, ఈ అంశాలపై అధ్యయనం చేయాలని సి.ఎస్ సూచించారు. ఈ డేటా సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్రం లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలతో పాటు అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు.