పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీ కేటీఆర్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, దేవరకొండ మున్సిపాలిటీలో పర్యటించారు. రూ.48 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం దేవరకొండ పట్టణంలోని సాయి రమ్య పంక్షన్ హాల్ లో జరిగిన వార్డు కౌన్సిలర్లు, అధికారులకు పట్టణ ప్రగతి పై అవగాహన సదస్సు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన పనులను వారికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మనం మారుదాం.. మన పట్టణాన్ని మార్చుకుందాం అనే నినాదంతో ప్రజలు తమ పట్టణాలను సుందరంగా చేసుకోవాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా దేవరకొండ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. రూ. 48.2 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నెట్వర్క్, రోడ్లు, పార్క్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా దేవరకొండ 10వ వార్డులోని హనుమాన్‌నగర్, లక్ష్మీకాలనీ, అయ్యప్పనగర్, జంగాల కాలనీల్లో మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దేవరకొండలో ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దేవరకొండలో కోతుల, పందుల బెడదను పరిష్కరిస్తామన్నారు. ఆరు ఎకరాల స్థలంలో డంపింగ్‌యార్డు నిర్మిస్తామన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ ఆటోలకు అందించాలని కోరారు. తడి చెత్తతో ఎరువును తయారు చేయనున్నట్లు తెలిపారు. సఫాయి కార్మికుల శ్రమవల్లే పట్టణాలు పరిశుభ్రంగా ఉంటున్నాయన్నారు. ఖాళీ ప్రదేశాల్లో ముళ్లపొదలు, చెట్లు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పట్టణంలో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి రాష్ట్రంలో బహిరంగ మలమూత్ర విసర్జన ఉండకుండా చేస్తామన్నారు. అత్యుత్తమ పౌరసేవలే లక్ష్యంగా నూతన మున్సిపల్ చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. నూతన మున్సిపల్ చట్టం ద్వారా ప్రతి మున్సిపాలిటీలో 10 శాతం నిధులు హరితహారం కోసం ఖర్చు చేసేలా నిబంధనలున్నాయన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బ్రతకాలి.. లేకపోతే కఠినచర్యలు తప్పవన్నారు. మున్సిపాలిటీల్లో ఇకపై లంచాల మాట వినపడొద్దని మంత్రి పేర్కొన్నారు.