మార్చి 6న దుబాయ్‌లో ప్రపంచ తెలుగు మహిళా సదస్సు

దుబాయ్‌లో మార్చి 6న రెండో ప్రపంచ తెలుగు మహిళాసదస్సును నిర్వహించనున్నట్లు ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ ఇండియా (ఐఆర్‌డీఏ) అధ్యక్షుడు పి.వినయ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను బౌద్ధనగర్‌ కార్పొరేటర్‌ ధనంజనగౌడ్‌, ఐఆర్‌డీఏ గౌరవ అధ్యక్షుడు వడ్లపట్ల చౌదరి, ఉపాధ్యక్షురాలు కోమల్‌ రాణి, కోఆర్డినేటర్‌ నఫియాబేగం, మాధవి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ వివిధ దేశాల్లో పలురంగాల్లో నిష్ణాతులైన మహిళలు ఈ సదస్సులో పాల్గొని వారి అనుభవాలను పంచుకుంటారని, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళాభివృద్ధి, సాధికారతపై చర్చ జరుగుతుందన్నారు. సదస్సుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సహకరించడం అభినందనీయమన్నారు. ముఖ్యఅతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, రాష్ట్ర ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌, క్రీడలు, యువజన వ్యవహారాలు, పర్యాటక, సంస్కృతిక, పురావస్తు శాఖామంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానెటి వనిత, ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, విద్య, వెల్ఫేల్‌ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, బొంతు శ్రీదేవి హాజరవుతున్నారన్నారు.