- 15024 మంది రైతులకు రూ. 2 కోట్ల మేర చేకూరనున్న అదనపు లబ్ధి
- రైతులకు అధిక ధరలు అందించి ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- ఆయిల్ ఫెడ్ ఫాక్టరీలలో ఆధునిక యంత్రాల ఏర్పాటు ద్వారా నూనె రికవరీ శాతాన్ని 20.01 కి పెంచగలిగా౦
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత మరియు వంట నూనెలను డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేసారు. ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటికి టన్నుకి ఆయిల్ పామ్ గెలల ధర రూ12534 /- ఉండగా ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధర రూ21546/- పెరగడం తో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని మంత్రివర్యులు పేర్కొన్నారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక ధరలను అందించి ఆయిల్ పామ్ సాగును లాభ సాటిగా చేయటమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.
ఆయిల్ ఫెడ్ వారి ప్రోసెసింగ్ మిల్లులలో నూనె రికవరీ శాతం మరియు ముడి పామాయిల్ అమ్మకం ధరల ఆధారంగా ప్రతి నెల ఆయిల్ పామ్ గెలల ధర నిర్ణయించడం జరుగుతుంది. అయితే తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా నడపబడుతున్న అప్పరావ్ పేట మరియు అశ్వరావుపేటలోని ఆయిల్ పామ్ కర్మాగారాలలో నూతన టెక్నాలజీతో కొత్త యంత్రాలు ఏర్పాటు చేయడం మరియు ఉన్న యంత్రాలను అధునికరించడం వల్ల ఆయిల్ పామ్ గెలల నుండి వచ్చే నూనె రికవరీ శాతం (OER) టన్నుకు 20.01 శాతముకు పెరగడం వల్ల టన్నుకు ఆయిల్ పామ్ గెలల ధర పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రివర్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయించబడిన ఆయిల్ పామ్ గెలల ధరను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవ్వాల్సిరావడంతో అక్కడ పామ్ ఆయిల్ రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతున్నది మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో 1992-93 నుంచి ఇప్పటి వరకు 2.90 లక్షల ఎకరాలను (79,113 రైతులు) ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడం జరిగిందని, ఈ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 1,07,400 ఎకరాలలో 33500 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టరని 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు కోసం 456 కోట్లు కేటాయించినట్లు మంత్రిగారు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో మరో రెండు లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని మంత్రివర్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం 68,600 ఎకరాల నుండి ఆయిల్ పామ్ గెలల ఉత్పత్తి జరుగుతున్నదని అన్నారు. రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించెందుకు ఏకరాకు రూ 50918/- రాయితిని నాలుగు సంవత్సరాల కాలానికి ఇవ్వడం జరుగుతున్నదని, దీర్ఘకాలిక లాభాల నుండి ఆయిల్ పామ్ సాగు కోసం రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముందుకు రావాలని మంత్రి కోరారు.