హైదరాబాద్ లోని గిరిజన సాంస్కృతిక పరిశోధన-శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న గిరిజన ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ శిక్షణ కార్యక్రమం ఈ రోజు విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు విట్టా సర్వేశ్వర్ రెడ్డి విజయవంతంగా శిక్షణను
పూర్తి చేసిన ముప్పై మంది గిరిజన ఆర్ట్ & క్రాఫ్ట్ టీచర్లను అభినందించి
తమ తమ పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఈ ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ కళను నేర్పించి వారి అభిరుచికి, ఆర్థికాభివృద్ధికై కృషి చేయాలని సూచించారు. కార్యక్రమ నిర్వాకులు గిరిజన సాంస్కృతిక పరిశోధన-శిక్షణ సంస్థం సంచాలకులు డా. వేమూరి సముజ్వల మాట్లాడుతూ ఈ అరుదైన శిక్షణ కార్యక్రమానికి వెసులుబాటు కల్పించిన గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్
చీఫ్ సెక్రెటరీ సబ్యసాచి ఘోష్ కి కృతజ్ఞతలు తెలుపడంతో పాటు ఈ శిక్షణలో నైపుణ్యం సాధించినవారు తమ తమ ఐటీడీఏలలో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థినీ విద్యార్థుల అభ్యున్నతికై కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో నిష్ణాతులైన అభ్యర్థులు తాము తయారు చేసిన బ్లాక్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ – చీరలు, షాలువాలు, డ్రెస్ మెటీరియల్స్- ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు. శిక్షణనిచ్చిన డా. సునీత ప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ కళకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ రెడీగా ఉందని, రెండు – మూడు రెట్లు లాభం వస్తుందని, గిరిజనులు తయారు చేసిన మెటీరియల్ను కొంతకాలం తమ సంస్థ ద్వారానే కొని వారికి మంచి మార్కెట్ చూపించగలమని అన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డెరెక్టర్లు పోచం, సంధ్యారాణి, సూపరింటిండింగ్ ఇంజనీర్ శ్రీమతి హేమలత, గిరిజన మ్యూజియం క్యురేటర్ డా. ద్యావనపల్లి సత్యనారాయణ, పీఈటీసీ కోఆర్డినేటర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.