హైదరాబాద్, మార్చి 4: మార్చి 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుజిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో నేడు సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సి.ఎస్. సంజయ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి టి .కె. శ్రీదేవి, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీ.ఎస్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన..ప్రగతి ప్రణాళిక అయిదు దశల్లో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమ నిర్వహణపై ఉమ్మడి జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్చార్జి మంత్రితో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి, ఈ సమావేశానికి జిల్లాలోని ప్రముఖ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. ఈనెల 12 వ తేదీన ఆయా జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు , సర్పంచులకు అవగాహనా సదస్సులు నిర్వహించాలని అన్నారు. ఇందుకుగాను పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయని అన్నారు. ఈ 99 రోజుల ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామ, మండల, నియోజక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని మరోసారి తెలిపారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తగు మార్గ దర్శకాలను జారీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.