బాధ్యతలు స్వీకరించిన సమాచార కమిషనర్లు

సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ఇటీవల నియామకమైన ఐదుగురు కమిషనర్లు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్త కమిషనర్లు కట్టా శేఖర్‌రెడ్డి, మైద నారాయణరెడ్డి, గగులోతు శంకర్‌నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్‌తో చీఫ్ కమిషనర్ రాజా సదారామ్ ప్రమాణ స్వీకారం చేయించారు. సమాచార కమిషనర్ బుద్దా మురళీ, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కొత్త కమిషనర్లు తమకు కేటాయించిన చాంబర్లలో బాధ్యతలు చేపట్టారు. ఇలా ఉండగా సమాచార హక్కు చట్టానికి ఇది వరకే ఒక చీఫ్ కమిషర్ రాజా సదారామ్, కమిషనర్ బుద్దా మురళీ ఉండగా తాజాగా నియామకమైన ఐదుగురితో కమిషనర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది. కాగా చీఫ్ కమిషనర్ రాజా సదారామ్‌కు ఈ ఏడాది ఆగస్టులో పదవీ కాలం ముగియనుంది.