- ఈ నెల 6వ తేదీన బమృకున్ – ఉద్- దౌలా
- మరో నాలుగైదు రోజుల్లో కూకట్‌పల్లి నల్లచెరువు
- సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు
మరో రెండు చెరువులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాతబస్తీలోని బమృకున్ – ఉద్- దౌలా చెరువుతో పాటు.. కూకట్ పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 6వ తేదీన బమృకున్ – ఉద్ – దౌలా చెరువును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఆతర్వాత మరో రెండు మూడు రోజుల్లో కూకట్‌పల్లి నల్ల చెరువును కూడా సీఎం రేవంత్‌రెడ్డి నగర ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. హైడ్రా మొదట విడత చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట గతేడాది సెప్టెంబరు 28న ప్రారంభమైన విషయం విధితమే. మరో మూడు చెరువులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి తోడు రెండో విడత మరో 14 చెరువులను హైడ్రా అభివృద్ధి చేయడానికి కసరత్తు చేస్తోంది. ఇలా నగరంలో మురికి కూపాలుగా మారిన చెరువుల రూపురేఖలు మార్చే పనిలో హైడ్రా నిమగ్నమైంది.
పాతబస్తీకి మణిహారం..బమృకున్ – ఉద్- దౌలా చెరువు
పాతబస్తీకి మణిహరం చారిత్రక బమృకున్ – ఉద్- దౌలా చెరువు. పాతబస్తీలో నిజాంల నాటి చారిత్రక చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. కబ్జాలను తొలగించి ఊపిరిలూదింది. ఆక్రమణలతో ఆనవాళ్లే కోల్పోయిన చెరువును బతికించింది. చరిత్రను తవ్వితీసిన మాదిరి చెరువును రూపొందించి చారిత్రక వైభవాన్ని హైడ్రా చాటింది. కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న చరిత్రకు ప్రాణం హైడ్రా ప్రాణం పోసింది. ఒకవైపు ఉన్న నాటి కట్టను మరింత పటిష్టం చేసి వాకింగ్ ట్రాక్‌ను హైడ్రా నిర్మించింది. కట్టపై ఓపెన్ జిమ్‌ను పెట్టి అన్ని వయసులవారి ఆరోగ్యానికి బాటలు వేసింది. చెరువు లోపలి వైపు ఫెన్సింగ్ పనులను పూర్తి చేసింది. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలను అభివృద్ధి చేశారు. వృద్ధులు సేద దీరే విధంగా అక్కడ గజబోలు నలువైపులా నిర్మించారు. చెరువుకు మూడు వైపులా ప్రవేశ మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. నిజాంల కాలంలో ఈ చెరువుకు ఎంతో చరిత్ర ఉందని.. దానిని పునరావృతం చేసేలా.. చుట్టూ ఔషధగుణాలున్న మొక్కలతో పాటు.. చల్లటి నీడనిచ్చే చెట్లను నాటారు. సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి.. హైడ్రా ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.
విహార కేంద్రంగా తీర్చిదిద్దాలి..
కాంక్రీట్ జంగిల్‌గా నగరాలు మారిపోతున్న వేళ.. పాతబస్తీలో నేషనల్ పోలీస్ అకాడమీకి చేరువలో అభివృద్ధి చేస్తున్న బమృకున్-ఉద్-దౌలా చెరువు విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు గతంలో పలుమార్లు సందర్శించినప్పుడు అధికారులను ఆదేశించారు. ఔషధ గుణాలున్న వృక్ష జాతితో పాటు.. మొక్కలను చెరువు చుట్టూ నాటాలని సూచించారు. పచ్చిక బైళ్లతో పార్కులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. బయటకు చెరువు పరిసరాల్లో ఉన్న ఉష్ణోగ్రతల్లో తేడా తెలిసేలా.. పచ్చని వాతావరణం ఉండేలా చూడాలన్నారు. నిజాంల కాలంలో చెరువు నిర్మాణంలో వాడిన రాతిని వినియోగించి కట్టడాన్ని పటిష్టం చేయాలన్నారు. ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్‌లు విశాలంగా ఉండేలా చూడాలన్నారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్ ఇలా 10 కిలోమీటర్ల మేర చెరువుకు వర్షం నీరు వచ్చేలా ఇన్‌లెట్లు నిర్మించాలని.. ఈ ప్రాంతంలో వరద కష్టాలకు ఈ చెరువు చెక్‌పెట్టేలా చూడాలని సూచించారు. ఇలా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి మార్గదర్శకంలో చెరువు సిద్ధమైంది.
చరిత్రను చాటేలా..
1770లో మూడవ నిజాం సికందర్ జాహ్ పాలనలో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్ – ఉద్ – దౌలా ఈ చెరువును నిర్మించారని.. అందుకే బమృకున్ – ఉద్- దౌలా చెరువు పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తాగు నీటి అవసరాలను తర్చేలా 104 ఎకరాల మేర ఈ చెరువు విస్తరించి ఉందని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో చెరువు విస్తీర్ణం తగ్గుతూ హెచ్ ఎం డీ ఏ ఈ చెరువును 17.05 ఎకరాలుగా నిర్ధారించింది. చివరికి 4.12 ఎకరాలుగా మిగిలిపోయింది. హైడ్రా 2024 ఆగస్టులో ఆక్రమణలను తొలగించింది. హెచ్ ఎం డీ ఏ పేర్కొన్న విధంగా పూర్తి స్థాయిలో భూమి అందుబాటులోకి తెచ్చింది. ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు అనేక అవరోధాలను అధిగమించి.. విమర్శలను ఎదుర్కొంది. అలా విమర్శించిన వారే ఔరా అనేట్టు హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేసింది. ఇప్పుడు స్థానికులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలలో కూడా ఊహించడం కష్టంగా ఉన్న ఈ ప్రాంతానికి ఇంత అందాన్ని తీసుకువచ్చిన హైడ్రాకు అభినందనలు తెలుపుతున్నారు.
చెరువు చుట్టూ చరిత్ర..
అడుగడుగునా చారిత్రక ఆనవాళ్లు, ఎన్నో విశేషాలు స్థానికంగా ఉన్న వృద్ధులు పలు విధాలుగా వివరిస్తున్నారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువుకు చేరేదని చెబుతున్నారు. నిజాంల కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బమృకున్ – ఉద్- దౌలా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవారని చెబుతున్నారు. అలాగే బమృకున్ – ఉద్- దౌలా చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి.. ఆ దిగువున నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగేందుకు నిజాం పాలకులు వినియోగించేవారని మరి కొంతమంది వివరిస్తున్నారు. ఔషధగుణాలున్న ఈ నీటిని మాత్రమే నిజాంలు వినియోగించేవారంటున్నారు. అంతే కాదు.. ఈ చెరువు చుట్టు సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి వినియోగించేవారని.. ఇందుకోసం అరబ్ దేశాలకు ఇక్కడి నీరు తీసుకెళ్లేవారంటున్నారు. ఇలా ఎంతో చరిత్ర ఉన్న ఈ చెరువు మళ్లీ పునరుద్ధరణకు నోచుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు సంబర పడుతున్నారు.
అత్యధిక జనసాంధ్రత ఉన్న ప్రాంతంలో నల్లచెరువు
ఎటు చూసినా నివాసాలు.. వరద నీరు ఎటు వెళ్లాలో తెలియని నిర్మాణాలు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన ప్రాంతంలో కూకట్‌పల్లి నల్లచెరువు ఆక్రమణలకు గురై బిక్కుబిక్కుమంటున్న తరుణంలో హైడ్రా దృష్టి ఆ చెరువుపై పడింది. మురుగు నీటితో దుర్గంధభరితంగా మారిన ఈ చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రా నిర్ణయించింది. 2024 సెప్టెంబరులో ఆక్రమణలు తొలగించినప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారంతో ఆక్రమణలను తొలగించే పనిని హైడ్రా చేపట్టింది. చెరువలోకి జరిగి ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డులను హైడ్రా తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలతో పాటు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడమే కాకుండా.. 3 మీటర్లకు పైగా మట్టిని కూడా తొలగించింది. అప్పుడు కాని దుర్గంధం దూరమవ్వలేదు. ఇప్పుడు చెరువు విస్తీర్ణం దాదాపు రెట్టింపు అయ్యింది. 16 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువు 30 ఎకరాలకు విస్తరించుకుంది. ఒకప్పుడు ఎలా ఉండేది. నేడు ఎలా అభివృద్ధి చెందింది అనేది చూడాలనుకుంటే కూకట్‌పల్లి నల్లచెరువును సందర్శించాల్సిందే. అక్కడ నివాసం ఉన్న వాళ్లే అచ్చెరవొందేలా కూకట్‌పల్లి నల్ల చెరువు తయారయ్యింది. బోటు షికారుకు చిరునామా అయ్యింది. ఎన్ని ప్రయాశలో.. ఎన్ని ఎదురు దెబ్బలో.. మరెన్ని విమర్శలో.. వీటన్నిటినీ తట్టుకుని పని చేసిన హైడ్రా కష్టానికి ఫలితమైంది. హైడ్రా పని తనానికి నిదర్శనంగా నిలిచింది. చెరువు అభివృద్ధిపట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు..
కూకట్‌పల్లి నల్లచెరువును హైడ్రా అభివృద్ధి చేసిన తర్వాత అక్కడి పరిసరాలు ఆహ్లాదంగా మారాయి. 5 కిలోమీటర్ల దూరం నుంచి ఈ చెరువు చెంత సేద దీరేందుకు, వాకింగ్‌కు, పిల్లలను ఆడించేందుకు వస్తున్నామని సందర్శకులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బుధవారం చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూకట్‌పల్లి నల్ల చెరువు చుట్టూ నివాస ప్రాంతాలున్నాయి. వర్షం పడితే .. చెరువులోకి వెళ్లడానికి దారి లేక వరదంతా నివాస ప్రాంతాలను ముంచెత్తేది. ఇప్పుడు నల్ల చెరువులోకి 7 ఇన్‌లెట్ల ద్వారా చేరుతోంది. చెరువు నిండితే సులభంగా వెళ్లేందుకు గతంలో ఉన్న ఔట్‌లెట్‌లను అభివృద్ధి చేశాం. మురుగు నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. చెరువులో జీవ వైవిధ్యం ఉండేలా ఐల్యాండ్స్ నిర్మించాం. బోర్లు జీవం పోసుకున్నాయి. చెరువు చుట్టూ దాదాపు కిలోమీటరున్నర పాత్ వే అందుబాటులోకి వచ్చింది. ఆదివారం అయితే ఇది పెద్ద పిక్నిక్ స్పాట్‌లా మారింది. ఆరోగ్య పరంగా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాం. మల్టీ పర్పస్‌గా దీనిని తయారు చేస్తున్నామని కమిషనర్ చెప్పారు.