తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా

హైదరాబాద్‌: తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హిమాచల్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న శివ ప్రతాప్‌ శుక్లాను తెలంగాణకు బదిలీ చేశారు. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్రకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. జిష్ణుదేవ్‌ వర్మను రాష్ట్రపతి ముర్ము 2024 జూలై 27న తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. సుమారు 19 నెలల పాటు తెలంగాణ గవర్నర్‌గా ఆయన వ్యవహరించారు. ఆయన 2018 నుంచి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివ ప్రతాప్‌ శుక్లా 1989లో తొలిసారి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 1991, 93, 96లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1996 నుంచి 1998 వరకు సీఎంలు మాయావతి, కల్యాణ్‌ సింగ్‌ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్‌ జైళ్ల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తదనంతర కాలంలో ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికై మోదీ తొలి క్యాబినెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2023 ఫిబ్రవరి 19న హిమాచల్‌ ప్రదేశ్‌ 22వ గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి మూడేండ్లు ఆ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించారు.