హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం నాడు బాచుపల్లిలోని విజ్ణానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (VJIM) లో ఫిక్కి (Federation of Indian Chambers of Commerce & Industry -ఫిక్కీ) నిర్వహించిన సిఎఫ్ ఓ ల సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేసారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు నగరంలో తమ ఆవిష్కరణలు, ఇంజినీరింగ్ కేంద్రాలను స్థాపిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. “కృత్రిమ మేధ టెక్నాలజీ పాత్రను పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటివరకు కంపెనీ ఖర్చులను లెక్కించడానికి ఉపయోగపడిన టెక్నాలజీ, ప్రస్తుతం ఆవిష్కరణలు, మెరుగైన ఆర్థిక నిర్ణయాలకు సహాయపడుతోంది. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా అభివృద్ధి చెందింది. వ్యాన్ గార్డ్( Vanguard), యుబిఎస్ (UBS), వెల్స్ ఫార్గో (Wells Fargo), బ్యాంక్ ఆఫ్ అమెరికా (Bank of America), మాస్ మ్యూచువల్ (MassMutual), ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ( Franklin Templeton), జెపి మోర్గాన్ చేస్ (JPMorgan Chase), గోల్డ్ మ్యాన్ శాక్స్ (Goldman Sachs), సిటి గ్రూప్ (Citigroup) లాంటి ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు నగరంలో భారీ టెక్నాలజీ, అనలిటిక్స్ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి.
నగరంలో ప్రస్తుతం 400 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) మూడు లక్షల మందికి పైగా వృత్తి నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయి. తెలంగాణ ఐటీ రంగం ఎగుమతులు సంవత్సరానికి దాదాపుగా 40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. తదుపరి దశ విస్తరణ కోసం ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐకేఏఎం (AIKAM) లను ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా ఏఐ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడం, డిజిటల్ మౌలిక వసతులను మెరుగుపర్చడం, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నిపుణులను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం.
డిజిటల్ యుగంలో సీఎఫ్ఓల పాత్ర మరింత కీలకంగా మారింది”. కృత్రిమ మేధ, డేటా ఆధారిత రంగాల్లో పెట్టుబడులకు మార్గనిర్దేశం చేయడంలో వారి సేవలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని శ్రీధర్ బాబు వివరించారు. సదస్సులో మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి, ప్రముఖ నిర్మాత, విజ్ణానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (విజెఇఎం) అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్ బాబు, ఫిక్కి సిఎఫ్ ఓ (CFO) కౌన్సిల్ ఛైర్మన్ రజనీష్ జైన్, కో ఛైర్మన్ సుబ్బయ్య కుమార్, విజ్ణాన జ్యోతి సంస్థల సిఇఓ, మాజీ డిజిపి అనురాధ తదితరులు పాల్గొన్నారు.