- హౌసింగ్ బోర్డు పరిధిలోని 5వేల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలి
- తెలంగాణ హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: ప్రజాపాలన- ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఐదు వేల రిజిస్ట్రేషన్లను క్లియర్ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రజలకు పారదర్శకంగా వేగవంతమైన సేవలు అందించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు రూపొందించిన రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను మంత్రి శనివారంనాడు సచివాలయంలో ప్రారంభించారు. అలాగే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ 99 రోజుల్లో హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డ్ నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. హౌసింగ్ బోర్డ్ పరిధిలో ఇండ్లు, ఫ్లాట్లు, స్ధలాలను వాయిదాల రూపంలో కొనుగోలు చేశారని ఇందులో కొంతమంది అసలు మరికొంతమంది వడ్డీలు చెల్లించాలని, ఇంకొంతమంది వాయిదాల గడువు ముగిసిపోయిందని ఈ విధంగా దాదాపు ఐదు వేల మంది తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిఉందని ఈసందర్భంగా అధికారులు మంత్రిగారికి వివరించారు.దీనిపై మంత్రిగారు స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అసలు, వడ్డీ, ప్రస్తుత మార్కెట్ ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ఈ పోర్టల్ వల్ల ప్రజలు ఎవరూ అధికారుల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదని, పూర్తి సమాచారం పోర్టల్ లోనే ఉంటుందన్నారు. కేటాయింపుదారులు తమ రిజిస్ట్రేషన్లు, చెల్లింపుల ధృవీకరణ మరియు ఇతర లావాదేవీల పర్యవేక్షణను ఒకే వేదిక ద్వారా సులభంగా పూర్తి చేసుకోవచ్చు.డిజిటల్ విధానం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, పౌరులకు సేవలు మరింత చేరువవుతాయి. ఇది హౌసింగ్ బోర్డు మరియు అలాటీల మధ్య నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ నిబద్ధత అని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్, సీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.