ఈ నెలాఖ‌రులోగా లక్ష ఇళ్ల ఇందిర‌మ్మ ఇండ్ల గృహప్రవేశాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • మంజూరు చేసిన అన్ని ఇండ్లు గ్రౌండింగ్ కావ‌ల్సిందే
  • డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు ల‌బ్దిదారుల‌ను గుర్తించండి
  • మంజూరు చేసిన అన్నిఇండ్ల‌కు చెల్లింపులు జ‌ర‌పాలి
  • ప్ర‌జా పాల‌న‌- ప్ర‌గ‌తి నివేదిక కార్యాచ‌ర‌ణ‌పై
  • జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ల తో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్‌

హైదరాబాద్:- రాష్ట్రంలో ప్ర‌తి పేద‌వాడి ఆత్మ‌గౌర‌వానికి చిహ్నంగా నిలిచేలా గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలో ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు చేస్తోంద‌ని, ఈ ప‌ధ‌కం ఒక బెంచ్ మార్క్‌గా నిల‌వ‌బోతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ఈ ప‌ధ‌కం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టివ‌రకు 3.60 ల‌క్ష‌ల ఇండ్ల‌ను మంజూరు చేయ‌గా ఇందులో ల‌క్ష ఇండ్ల‌కు ఈనెల 31వ తేదీలోగా గృహ‌ప్ర‌వేశాలు జ‌రుగనున్నాయ‌ని తెలిపారు. ఇందుకోసం త్వరలోనే గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలను అధికారికంగా తెలియజేస్తామని తెలిపారు.ఇండ్లు మంజూరు చేసిన త‌ర్వాత కూడా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పూరిగుడిసెలు కనిపిస్తున్నాయని, అటువంటి కుటుంబాలకు అత్యంత‌ ప్రాధాన్యత ఇచ్చి ఇళ్ల నిర్మాణంలో చేర్చాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఇల్లు నిజంగా అవసరమైన వారికి చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. శ‌నివారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యం నుంచి ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి నివేదిక 99 రోజుల్లో చేప‌ట్ట‌వ‌ల‌సిన కార్యాచ‌ర‌ణ‌పై జిల్లా హౌసింగ్ పీడీల‌తో మంత్రి గారు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మంత్రిగారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్య‌క్ర‌మాన్ని అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసిన ఇండ్ల‌లో 20 శాతం వ‌ర‌కు గ్రౌండింగ్ కాలేద‌ని అలాంటి ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల సమ్మతి తీసుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సూచనలతో మార్చి 31 లోపు అన్ని ఇండ్లు గ్రౌండింగ్‌ అయ్యేలా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న‌ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.

ప్రస్తుతం నిర్మాణం పూర్తికి దగ్గరగా ఉన్న ఇళ్లను సమర్థంగా సమన్వయం చేసుకొని జూన్ చివ‌రినాటికి పూర్త‌య్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఏప్రిల్ నెల‌లో రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు చేసేనాటికి మొద‌టి ద‌శ ఇందిర‌మ్మ ఇండ్లు కొలిక్కిరావాల‌ని సూచించారు. ఇండ్ల‌ నిర్మాణంలో ఉపయోగించే నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల లబ్ధిదారులపై అదనపు భారం పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుకుగా పనిచేయాలని మంత్రి సూచించారు. అవసరమైతే జిల్లా కలెక్టర్లతో కలిసి సమీక్షించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఇండ్ల‌ నిర్మాణానికి అవసరమైన ఇటుకల సరఫరా పెంచేందుకు స్థానికంగా ఎస్ హెచ్ జి మ‌హిళా సంఘాల ద్వారా బ్రిక్ యూనిట్లను ప్రోత్సహించాల‌ని మంత్రి తెలిపారు. అవసరమైతే ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా సరఫరా పెరిగి ధరలు నియంత్రణలో ఉండే అవకాశముందని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇండ్ల కోసం ఉచిత ఇసుక పంపిణీ చేస్తుంద‌ని ల‌బ్దిదారుల‌కు ఎక్క‌డా స‌మ‌స్య రాకుండా ఈ ఇసుక ల‌భించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇందిర‌మ్మ ఇండ్లను మంజూరు చేసి ఒకటి లేదా రెండు విడతల చెల్లింపులు చేసిన తర్వాత వివిధ కార‌ణాల‌తో చెల్లింపులు నిలిపివేయ‌డం స‌రికాద‌న్నారు. ఇటువంటి చెల్లింపులను త‌క్ష‌ణ‌మే క్లియ‌ర్ చేయాల‌ని లేని ప‌క్షంలో అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి వెన‌కాడ‌బోమ‌ని హెచ్చ‌రించారు. ఏప్రిల్ నెల నుంచి మంజూరు చేసే రెండ‌వ విడ‌తలో ఇటువంటి ప‌రిస్ధితి పున‌రావృతం కాకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. నిజమైన లబ్ధిదారుల ఇళ్లు ఎక్కడా ఆగిపోకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఏ స్ధాయిలో నిర్మాణంలో ఉన్నాడబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను కూడా మార్చి 31 లోపు పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ఇళ్ల స్థలం లేని పేద కుటుంబాలకు ఈ ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఏ సంక్షేమ పథకం విజయవంతం కావాలంటే ముఖ్యమంత్రి, మంత్రి, కార్యదర్శి మాత్రమే ప్రయత్నించడం సరిపోదని, ఆ శాఖలోని ప్రతి అధికారి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినప్పుడే అది సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. అధికారుల సమిష్టి కృషి వల్లే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశంలోనే ఉత్తమ పథకాలలో ఒకటిగా నిలిచిందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం అందించే గొప్ప సంక్షేమ కార్యక్రమమని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం, అధికారులు భాగస్వాములుగా ఉండటం గర్వకారణమని, ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడానికి ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని హౌసింగ్ రంగంలో విజయవంతం చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కోరారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో హౌసింగ్ కార్య‌ద‌ర్శి విపి గౌత‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.