ఖరీఫ్ సీజన్ కోసం ముందుగానే ఎరువులను తెప్పించి, నిల్వ ఉంచుకోవాలని అధికారులకు అదేశం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ నిధులు నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేసేలా విధివిధానాలు తయారుచేయాలి
  • ఎప్రిల్ నెలాఖరు వరకు పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలి – మంత్రి తుమ్మల
  • రైతు వేదికలపై రెడ్కో సహకారంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు మంత్రి తుమ్మల ఆదేశాలు

హైదరాబాద్ : వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసే విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలించి, అవసరమైన విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా రైతులు కొనుగోళ్లు చేసిన పనిముట్లకు 40 శాతం సబ్సిడీ నిధులను సదరు కంపెనీలకు అందించే పద్దతి ఉంది అలా కాక, వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేసే అవకాశాలను పరిశీలించి అందుకు తగ్గ విధివిదానాలను తయారు చేయాలన్నారు. రాష్ట్రంలో రైతులకు సబ్సిడీపై అందించే పచ్చిరొట్ట విత్తనాలను వచ్చే ఏప్రిల్ నెలాఖరు సిద్దంగా ఉంచుకోవాలని అందుకు తగ్గ ఏర్పాట్లు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు రెడ్కో సంస్థ సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొదట ప్రయోగాత్మకంగా జంగారెడ్డిపల్లి మరియు జనంపేట రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి వాటి పనితీరును పరిశీలించిన తరువాత మొదటి దశలో రాష్ట్రంలోని 1600 రైతు వేదికలలో రెడ్కో ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

రానున్న ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే తెప్పించి నిల్వ ఉంచేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన కూడ ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో వరి, పత్తి, మక్క వంటి ప్రధాన పంటల సాగు విస్తృతంగా జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా మక్క పంటకు వరి లేదా పత్తి పంటలతో పోలిస్తే యూరియా అవసరం దాదాపు మూడింతలు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. నీటి నిల్వలు సమృద్ధిగా ఉండటం, నేలలో తేమ నిల్వ ఉండటం, అలాగే దక్షిణ పశ్చిమ రుతుపవనాలు సాధారణంగా ప్రారంభమవుతాయనే అంచనాల నేపథ్యంలో రానున్న ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సుమారు 60.60 లక్షల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్–2026 సీజన్‌కు రాష్ట్రానికి 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.