- కేంద్ర సాధికారత కమిటీ ఆదేశాలతో అటవీ శాఖ నిర్ణయం
- క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లనున్న సూర్యాపేట జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్
- అన్ని డాక్యుమెంట్లతో విచారణకు రావాలని డెక్కన్ సిమెంట్స్ కంపెనీకి డీఎఫ్‌వో సమాచారం
సూర్యాపేట జిల్లాలోని సైదుల్‌నామా రిజర్వ్ ఫారెస్టులో డెక్కన్ సిమెంట్స్ పరిశ్రమ అరాచకాలపై ఎట్టకేలకు రేపు క్షేత్రస్థాయిలో విచారణ జరుగనున్నది. అటవీ భూములను డెక్కన్ సిమెంట్స్ పరిశ్రమ ఆక్రమించి, అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేపట్టడంపై ఇంజినీర్ పసుపులేటి సురేశ్‌బాబు గత కొన్నేండ్ల నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ క్రమంలో సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ)కి ఫిర్యాదు చేయడంతో డెక్కన్ సిమెంట్స్ పరిశ్రమ అరాచకాలపై విచారణ మొదలైంది. కానీ, ఈ వ్యవహారంలో రాష్ట్ర అటవీ, గనుల శాఖ అధికారులు సరైన సమాచారాన్ని ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సీఈసీ.. గత నెల 25న ఆ అధికారులను ఢిల్లీకి పిలిపించి విచారించింది.
అనంతరం క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, ఆ విచారణకు ఫిర్యాదుదారుడిని సైతం తీసుకెళ్లాలని సీఈసీ చైర్మన్ రాష్ట్ర అటవీ శాఖను ఆదేశించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయి పరిశీలనకు అటవీ శాఖ తేదీని ఖరారు చేసింది. దీంతో సూర్యాపేట జిల్లా అటవీ శాఖాధికారి వీ. సతీశ్ కుమార్ సోమవారం ఉదయం 11 గంటలకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు ఫిర్యాదుదారుడు సురేశ్‌బాబుతో పాటు డెక్కన్ సిమెంట్స్ పరిశ్రమకి అధికారులు సమాచారం అందించారు. ఆ కంపెనీ తరఫున అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తిని సంబంధిత డాక్యుమెంట్లు, జియోగ్రాఫికల్ డాటా, మ్యాపులు తదితర సాంకేతిక వివరాలతో కూడిన కీహోల్ మార్కప్ లాంగ్వేజ్ (కేఎంఎల్) ఫైల్స్, ఫొటోలతో క్షేత్రస్థాయికి పంపాలని, డీఎఫ్‌వో స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అటవీ శాఖ సీఈసీకి పూర్తిస్థాయి నివేదికను సమర్పించనున్నది.