- ఆరు వేల మంది మహిళా రైతుల హాజరు..
- పాల్గొన్న మంత్రులు తుమ్మల,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,సీతక్క
- రైతాంగ సంక్షేమ కోసమే నిరంతరం పని చేస్తున్నామని మంత్రుల ప్రకటన..
రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణం లో రెండు రోజుల పాటు జరగనున్న మెగా రైతు మేళా ఈ రోజు ప్రారంభమైంది.పీ జే టీ ఏ యూ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్,రాష్ట్ర వ్యవసాయ శాఖలు సంయుక్తం ఈ మేళా ని నిర్వహిస్తున్నాయి.అంతర్జాతీయ మహిళా దినోత్సవం ని పురస్కరించుకొని, 2026 ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యం లో ఈ మేళాని ఏర్పాటు చేసారు.రాష్ట్రం నలుమూలనుంచి పెద్ద సంఖ్యలో రైతులు,మహిళా రైతులు,వ్యవసాయ రంగ నిపుణులు,వ్యవసాయ విద్యార్థులు ఈ మేళాకి హాజరు అయ్యారు.ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి నేత్రత్వం లోని తమ ప్రభుత్వం వ్యవసాయం,రైతాంగ సంక్షేమమే ఊపిరిగా నిరంతరం పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.ప్రపంచంలోనే తెలంగాణా రైతుని తలెత్తుకుని నిలబడేలా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.దేశం లో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తర్వాత తమ నేత రాహూల్ గాంధీ అలోచనకి అనుగుణం గా సుమారు 25 లక్షల మందికి సుమారు 21 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసామన్నారు.గత ప్రభుత్వం లో ఆగిపోయిన రాయితీ విత్తనాలు,వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల్ని పునరుద్ధరించి ప్రారంభిస్తున్నామని తుమ్మల వివరించారు.500 కోట్ల రూపాయల తో పునరుద్దరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం లో మహిళా రైతుల కే పెద్ద పీటవేస్తున్నామన్నారు. భవిష్యత్తులో మహిళలకే డ్రోన్ లు అందిస్తామని తెలిపారు.పంటమార్పిడి,సహజ వ్యవసాయ విధానాలని విరివిగా ప్రోత్సహిస్తున్నామన్నారు.ప్రతి జిల్లాలో ఆయిల్ పాం పరిశ్రమని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కోన్నారు.తమ ప్రభుత్వం రాగానే మూడు కొత్త వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేసామని తెలిపారు.రైతు వేదికల ద్వారా రైతులకి అధునాతన టెక్నాలజీలపై అవగాహన కలిపిస్తున్నామని వివరించారు.రైతు లు తమ ఉత్పత్తులకి విలువ జోడింపు కి తోడ్పడే టెక్నలాజీలని,యాంత్రీకరణల్ని ప్రోత్సహిస్తున్నామని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.అధునాతన నైపుణ్యాలు,టెక్నాలజీలని ఉపయోగించుకొని ప్రజల అవసరాలకి సరిపడా అహారధాన్యాలని రైతులు పండించాలని రాష్ట్ర ఐ.టీ,పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.అలాగే భూసార పరిరక్షణ,పంటల వైవిధ్యీకరణ ల పై రైతులు ప్రత్యేక దృష్టి పెట్టా లని సూచించారు.ప్రపంచం లో ఎక్కడ యుద్ధం జరిగినా మన పైన కూడా ప్రభావం పడుతున్న విషయాన్ని గమనించి ఆహారధాన్యాల విషయం లో స్వావలంబన సాధించాలన్నారు.కొత్త వంగడాలు,టెక్నాలజీలని అందుబాటులోకి తీసుకొని వచ్చి వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకి అసమాన సేవ చేస్తున్నదని శ్రీధర్ బాబు ప్రశంసించారు.మెగా రైతు మేళా నిర్వహిస్తున్నందుకు జయశంకర్ యూనివర్సిటీని రాష్త్ర పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క అభినందించారు.
రైతులకు ఉపయోగపడే స్టాళ్లను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలియ చేసారు.ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిందన్నారు. అందరికీ అత్యంత అవసరమైనది ఆహారమని అది అందరికీ అందుబాటులో ఉండాలంటే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగాలన్నారు. ఆహార ఉత్పత్తిలో మహిళలది ప్రధాన పాత్ర అని, 60 నుంచి 80 శాతం మంది మహిళలు వ్యవసాయంలో పనిచేస్తున్నారని సీతక్క అన్నారు. విత్తనాలు నాటిన నుంచి పంట కోసి ఇంటికి చేర్చే దాకా ఆడబిడ్డలు చెమటోడ్చుతారని వివరించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని
అయినా మహిళల శక్తికి తగ్గ గౌరవం దక్కడం లేదు సీతక్క అభిప్రాయ పడ్డారు.
మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తోందని సీతక్క వివరించారు.రైతాంగ సంక్షేమానికి తెలంగాణా ప్రభుత్వం అసమాన కృషి చేస్తున్నదని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరక్టర్ జనరల్ ఎం.ఎల్.జాట్ అన్నారు.కొత్త టెక్నాలజీలని రైతాంగాని కి అందుబాటులోకి తీసుకొని రావడం లో తెలంగాణా ఇతర రాష్ట్రాలకి మార్గదర్శకం గా ఉందన్నారు.స్వయాన రైతే వ్యవసాయ శాఖా మంత్రి గా ఉండటం ప్రశంసనీయమని జాట్ అన్నారు.పర్యావరణాన్ని,జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని జాట్ సూచించారు.ఆయిల్ పాం లో తెలంగాణా అద్భుత ప్రగతి సాధిస్తోందని ఇది మారుతున్న పంటల సరళికి మంచి రుజువన్నారు.పంటల వైవి ధ్యీకరణ,కొత్త టెక్నాలజీలని అమలు చేయడం,రైతాంగాన్ని మార్కెట్ లకి అనుసంధానం చేయడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జాట్ సూచించారు.రాష్ట్రం లో ఉన్న ఎనిమిది ఐకార్ సంస్థలు,రెండు ప్రాంతీయ కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం,పీ జే టీ ఏ యూ ల తో కలిసి పని చేయడానికి నిరంతరం సిద్ధం గా ఉన్నాయని జాట్ తెలిపారు.భారతదేశ వ్యవసాయ రంగం లో మహిళల వాటా సుమారు 58 శాతం అని పీ జే టీ ఏ యూ ఉప కులపతి అల్దాస్ జానయ్య అన్నారు.తమ విశ్వవిద్యాలయం లో బోధన సిబ్బంది లో 50 శాతం మహిళలున్నారని, వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థులలో 70 శాతం అమ్మాయేలనని జానయ్య వివరించారు. మహిళల రైతాంగానికి సాధికారిత కల్పించేందుకు ఈ మెగా రైతు మేళాని నిర్వహిస్తున్నామన్నారు. రసాయన ఎరువులని మితిమీరి వాడటం వల్ల నేల ఆరోగ్యం చెడిపోవడం తో పాటు ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని జానయ్య అన్నారు. కోటి మంది మహిళలని కోటేశ్వరులని చేయాలన్న ప్రభుత్వ లక్ష్య సాధన లో మహిళా రైతుల పాత్ర కీలకం అన్నారు. ఈ దిశగా మహిళా రైతులకి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించనున్నామని జానయ్య తెలిపారు. ఈ సందర్బంగా 30 మంది మహిళా రైతులకి, ఆరుగురు వ్యవసాయ పాత్రికేయులకి మంత్రులు అవార్డులు అందచేశారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి, ఉద్యాన శాఖ సంచాలకులు శ్రీమతి యాస్మీన్ బాషా,శాసనమండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ శాసన సభ్యులు టి. ప్రకాష్ గౌడ్, కోరమాండల్ ఎం. డి. శంకర సుబ్రహ్మణ్యం, ఐకార్ సంస్థల అధికారులు పాల్గొన్నారు.