- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- చెరువులను అభివృద్ధి చేయాలంటూవినతులు
హైడ్రా ప్రజావాణికి సోమవారం 32 ఫిర్యాదులందాయి. స్మశానం వైపు చూడాలంటేనే వెనుకడుగు వేస్తాం.. అలాంటిది వాటిని కబ్జా చేసి ఇళ్లు నిర్మించేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. అలాగే చెరువులు, నాలాలు కబ్జా కాకుండా కాపాడాలని ఫిర్యాదులందాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువులను చూస్తే ముచ్చటేస్తోందని.. మా ప్రాంతంలోని చెరువులను కూడా అభివృద్ధి చేయాలని పలువురు ప్రజావాణిలో దరఖాస్తులు అందజేశారు. ముందుగా మురుగునీటిని బయటకు పంపి.. గుర్రపుడెక్కను వదిలించాలని కోరుతున్నారు. గొలుసుకట్టు చెరువుల మాదిరి అభివృద్ధి చేసి.. వరద ముప్పు లేని నగరంగా తీర్చిదిద్దాలని కాలనీవాసులు, సంక్షేం సంఘం ప్రతినిధులు హైడ్రాకు వినతిపత్రాలు సమర్పించారు. ఇలా సోమవారం ప్రజావాణికి 32 ఫిర్యాదులందాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్య గారు పరిశీలించి, సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు.
ఫిర్యాదులు ఇలా…
యూసుఫ్‌గూడ, మధురానగర్ ప్రాంతాల్లో ఉన్న కృష్ణాకాంత్ పార్కులో చెరువును అభివృద్ధి చేయాలని వాకర్స్ అసోసియేషన్ హైడ్రాను కోరారు. గతంలో ఉన్న చెరువును చాలా వరకూ పూడ్చేసి పార్కును చేశారని.. ఇప్పుడున్న చెరువును కొంతమేర విస్తరిస్తే చాలా వరకు వరద కట్టడి చేయవచ్చునని పేర్కొన్నారు. పార్కులో ఇప్పుడున్న చెరువు నిర్వహణ కరువై దుర్గంధభరితంగా మారిందని పేర్కొన్నారు. ఈ చెరువులో స్వచ్ఛమైన నీరు చేరితే భూగర్భజలాలు పెరుగుతాయని అన్నారు. ఈ వేసవి కాలంలోనే చెరువు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.
శేరిలింగంపల్లి పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్-1 కాలనీలో పార్క్ నం.4 భూమిని కొందరు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు HYDRAA ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. కాలనీకి ఆనుకుని ఉన్న భూమి యజమానులమని చెప్పుకుంటూ 20 ఏళ్ల క్రితం నిర్మించిన బౌండరీని ధ్వంసం చేసి పార్క్ భూమిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఆక్రమణదారులు పార్క్ కంపౌండ్ వాల్లో కొంత భాగాన్ని కూల్చివేయడంతో ప్రస్తుతం పార్క్ భూమి రక్షణ లేకుండా ఉందని పేర్కొన్నారు. వెంటనే పార్క్ ని కాపాడాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండల్ లో ని TNGO’s Colony పరిధిలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు హైడ్రా ప్రజావాణి కి ఫిర్యాదు చేసారు. ప్లాట్ నంబర్ 311 ప్రాంతంలో సుమారు 300 గజాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉందని తెలిపారు. ఈ స్థలం గతంలో అధికారికంగా కేటాయించబడిన ప్లాట్ల మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. ఆక్రమణలను వెంటనే తొలగించి, ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఫిర్యాదుదారులు హైడ్రా ప్రజావాణి లో కోరారు.
శంషాబాద్ లోని ఎం.బి. మిషన్ కంపౌండ్‌లో ఉన్న సమాదులు కబ్జాకు గురౌతున్నాయని HYDRAA ప్రజావాణి లో ఎం.బి. చర్చి, ఎం.బి. సమాధుల నిర్వహణ కమిటీ ప్రతినిధి పవిత్ర సాగర్ ఈ ఫిర్యాదు చేశారు. శంషాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 619లో ఉన్న చర్చి సమాధులకు సబంధించిన భూమి శతాబ్దానికి పైగా చర్చికి చెందినదిగా ఉందని తెలిపారు. ఈ భూమి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో కూడా నమోదై ఉందని పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 618గా చూపిస్తూ రికార్డులను మార్పులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ పొందినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అక్రమంగా కంచెలు వేయడం, నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతోందని తెలిపారు.