మ‌న న‌గ‌రం ఎంతో సుర‌క్షితం: సీఎం రేవంత్ రెడ్డి

  • మ‌రింత అభివృద్ధి చేసుకుందాం
  • ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దుకుందామ‌న్న సీఎం
  • కూక‌ట్ ప‌ల్లి న‌ల్ల చెరువును ప్రారంభించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

దేశంలో అనేక న‌గ‌రాల‌కంటే మ‌న న‌గ‌రం ఎంతో సుర‌క్షిత‌మైంది.. దీనిని మ‌రింత అభివృద్ధి చేసుకుందామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా దీనిని తీర్చిదిద్దుకుందామ‌ని సూచించారు. ఎన్నిక‌ల‌ప్పుడే రాజ‌కీయాలు.. త‌ర్వాత అభివృద్ధిపై అంద‌రూ దృష్టి పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. హైడ్రా మొద‌టివిడ‌త‌గా అభివృద్ధి చేసిన ఆరు చెరువుల్లో కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువును న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో తీవ్ర కాలుష్యం ఉంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంటుకు సెలవులు ఇచ్చే పరిస్థితి ఉంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉన్నప్పటికీ.. ఆ నగరాన్ని బాగు చేసే అవకాశం లేనంతగా కాలుష్యం పెరిగింది. ముంబయిలో వరదలొస్తున్నాయి. బెంగళూరులో ఎయిర్‌పోర్టుకు ఎన్ని గంటల్లో చేరుకుంటామమో చెప్పలేం. చెన్నైని వరదలు వేధిస్తున్నాయి. ఒక్క హైదరాబాదే సురక్షితమైన న‌గ‌రంగా ఉంది. ఇక్క‌డ దేశంలోని న‌లుమూల‌ల నుంచి వ‌చ్చి ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు పొందుతున్నారు. వారంద‌రికీ మెరుగైన జీవ‌నాన్ని అందించ‌డానికి న‌గ‌రాన్ని మ‌రింత అభివృద్ధి చేసుకుందామ‌ని ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు.

మ‌న మూసీ న‌దిని కూడా అభివృద్ధి చేసుకుందాం..
గుజ‌రాత్‌లోని సబర్మతి, ఉత్తర ప్ర‌దేశ్‌లోని గంగాన‌ది, యుమునాన‌ది రివ‌ర్ ఫ్రంట్‌లు అభివృద్ధి చేసుకుని ప్ర‌గ‌తి సాధించామ‌ని చెబుతున్నారు. మ‌న‌మెందుకు మ‌న మూసీ న‌దిని అభివృద్ధి చేసుకోరాద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. మూసీ ప‌రివాహ‌కంలోనే కాదు చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌లో కూడా ఎవ‌రికైనా న‌ష్టం జ‌రిగితే త‌గిన విధంగా న‌ష్ట‌ప‌రిహారం చెల్లిద్దాం.. పేద‌ల‌కు న‌ష్టం చేయ‌డం ప్ర‌భుత్వ విధానం కాదు.. వారిని ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని చెప్పారు. మూసీ ప్రక్షాళన మాత్రం జరగాల్సిందే. మహానగరంలో క్యూర్‌ పరిధిలో మూడు కార్పొరేషన్లు వచ్చాయి. కమిషనరేట్లు వచ్చాయి. రోడ్లు విస్తరించుకుందాం. పైవంతెనలు కట్టుకుందాం. పిల్లలకు క్రీడా మైదానాలు నిర్మించుకుందాం. ఒక మంచి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందామన్నారు.

చెరువుచుట్టూ తిరిగితే మ‌న‌సు ప్ర‌శాంతం..
కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువును పున‌రుద్ధ‌రించాం.. చెరువు చుట్టూ పాత్ వే నిర్మించాం… ఇంకా చాలా ఆక‌ర్ష‌ణ‌లు రావాల్సి ఉంది. ఇంట్లో మ‌న‌సు చికాకుగా ఉన్న‌ప్పుడు ఈ చెరువుచుట్టూ ఒక‌సారి తిరిగితే కొద్దిగా తేలిక ప‌డ‌తారు. వృద్ధులు కానించి చిన్న పిల్ల‌ల వ‌ర‌కూ ఇలా చెరువుకి వ‌చ్చి సేద‌దీరి వెళ్ల‌వ‌చ్చున‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. ఈ చెరువు అభివృద్ధి స‌మ‌యంలో స‌మ‌స్య‌లు తలెత్తాయి.. వాటిని అధిగ‌మించి చెరువును ఎంతో బాగా అభివృద్ధి చేశారు. మీ ముఖాల్లో ఆ ఆనందం క‌నిపిస్తోంది. మీ సంతోషం చూస్తే.. నాకు ముచ్చ‌టేస్తోంది అని అన్నారు. నాడు ఎంపీగా, ప్రశ్నించే గొంతుకగా, నేడు సీఎంగా మీ ముందు నిలబడటం ఎంతో ఆనందంగా ఉంది. నాడు ఎంపీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక ఉన్నా.. నిధులు, అలాంటి పరిస్థితులు లేక చేయలేకపోయాను. మీ ఆశీర్వాదంతో సీఎంను అయ్యాను. నాడు చేయలేకపోయిన అభివృద్ధి.. మల్కాజిగిరి పార్లమెంటు నియెజకవర్గంలోని ప్రతి వీధిని అభివృద్ధి చేస్తాను అని హామీ ఇచ్చారు.

30 ఎక‌రాల‌కు విస్త‌రించాం..
అత్యంత జ‌న‌సాంధ్ర‌త ఉన్న ప్రాంతంలో కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌తో కుంచించుకుపోయింది. ఈ చెరువును పున‌రుద్ధ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.. ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో అనేక స‌వాళ్లు ఎదుర‌య్యాయ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అన్నారు. వాటిని అధిగ‌మించి అభివృద్ధి చేశాం.. ఇప్పుడు ఇక్క‌డి స్థానికులే ప్ర‌శంసిస్తున్నారు. ఈ చెరువుచెంత ష‌టిల్‌కోర్టు కావాల‌ని స్థానికులు అడిగారు, పిల్ల‌లు ఆడుకునేందుకు వెసులుబాటు క‌ల్పించ‌మ‌న్నారు. ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఉంది. ఆక్ర‌మ‌ణ‌ల‌తో కుంచించుకుపోయిన న‌ల్ల‌చెరువును 16 ఎక‌రాల నుంచి 30 ఎక‌రాల‌కు విస్త‌రించామ‌న్నారు. సైకిల్‌ ట్రాక్, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించాం. రూ.20కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి. ష‌టిల్‌కోర్టు కావాలని స్థానికులు అడుగుతున్నారు. అలుగును మెరుగుపరిచాం. వరద నివారణ కోసం ఇన్‌లెట్, అవుట్‌లెట్‌ను అభివృద్ధి చేశామ‌ని చెప్పారు. చెరువు అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్న‌ప్పుడే వేలాది మంది ఇక్కడకొచ్చి ఆటలాడారు. వనభోజన కార్యక్రమాలు జరిగాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడిగాంధీ, డిప్యూటీ స్పీకర్ రామ‌చంద్ర నాయ‌క్‌, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు బండి ర‌మేష్‌, సీఎంసీ కమిషనర్ శ్రీ‌మ‌తి సృజన, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, మేడ్చల్ – మల్కాజగిరి కలెక్టర్ మను చౌదరి త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.