గిరిజన సంక్షేమశాఖ నూతన సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన సంతోష్ బి.ఎం., ఐఏఎస్

హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ రోజు సంతోష్ బి.ఎం., ఐఏఎస్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సంతోష్ బి.ఎం. మాట్లాడుతూ ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో వారి వారి విధులు, పనులను గూర్చి సమీక్ష చేశారు. చేయవలసిన పనులను గూర్చి తనకు విభాగాల వారీగా తెలియజేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ-ఫైల్స్ పెట్టడం కూడా ప్రారంభించాలన్నారు. విభాగాలవారీగా అధికారులు తమ విధులు, బాధ్యతల గురించి తనకు వివరాలు ఇవ్వాలని, ఆ మేరకు పనులు చేసుకుంటూ వెళ్తామని అన్నారు. గిరిజన సంక్షేమ పథకాలు అన్ని కూడా అడవులలో చివరి మజిలీలో ఉన్న చివరి గిరిజనులకు కూడా చేరేటట్లు ప్రణాళికలు రచించాలని, ప్రత్యేకించి గిరిజనుల ఆరోగ్యం, విద్యావకాశాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గిరిజన సంక్షేమం మీద పూర్తి అవగాహన ఏర్పరచుకుని వారం రోజులలో గిరిజన ప్రాంతాలలో పర్యటించి గిరిజన సమస్యలను, సంక్షేమ అవసరాలను తెలుసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సంతోష్ బి.ఎం. కి గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు విట్టా సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ బాలు, గిరిజన పరిశోధన సంస్థ సంచాలకులు డా. వి. సముజ్వల, జీసీసీ జీఎం ప్రతాప్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్లు పోచం, శ్రీమతి సంధ్యారాణి తదితర అధికారులు పూల మొక్కలు ఇచ్చి ఆహ్వానించారు. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంతోష్ బి.ఎం. సచివాలయానికి వెళ్ళి సంక్షేమ శాఖల స్పెషల్ చీప్ సెక్రెటరీ సబ్యసాచి ఘోష్ కి పూల మొక్క ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.