- 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఐటీఐలో ఆధునిక కోర్సులు
తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)లో నూతన స్వల్పకాలిక కోర్సులను రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎన్‌సీ మెషిన్ ఆపరేషన్, రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీ, 2D మరియు 3D ప్రొడక్ట్ డిజైనింగ్ వంటి ఆధునిక కోర్సులను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. యువతకు ఆధునిక నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, అధికారులు, ట్రైనర్లు పాల్గొన్నారు. ఏటీసీ మరియు ఐటీఐ విద్యార్థులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందన్నారు. ఈ ప్రణాళికలో తీసుకున్న నిర్ణయాలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన యువత అందుబాటులో లేరని అనేక పరిశ్రమలు చెబుతున్నాయని, అందుకే ఇండస్ట్రీలకు అవసరమైన స్కిల్ సెట్స్పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏటీసీలు, ఐటీఐలు భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన శిక్షణ పొందిన నిపుణులను తయారు చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. నేటి ప్రపంచంలో ఒక్క నైపుణ్యం సరిపోదని, యువత మల్టీ స్కిల్డ్ ఉంటేనే అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. ఏటీసీల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణా విధానం ఉండాలని ప్రిన్సిపాల్స్‌కు సూచిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన కోర్సులను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రపంచంతో పోలిస్తే వ్యవసాయ రంగంలో మన ఉత్పాదకత తక్కువగా ఉన్నందున అగ్రి అలైడ్ సెక్టార్‌లో నైపుణ్యాలను పెంచే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జీనోమ్ వ్యాలీ ప్రాంతంలోని పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడి పరిశ్రమలకు అవసరమైన కోర్సులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులు జీవితంలో విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అదేవిధంగా టామ్‌కామ్ ద్వారా విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ అందిస్తున్నామని, విదేశాల్లో మెరుగైన వేతనాలతో మంచి అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఏటీసీల నుంచి ఇప్పటికే పలువురు విద్యార్థులు ఉద్యోగాల్లో చేరుతున్నారని, భవిష్యత్తులో జిల్లాల వారీగా జాబ్ మేళాలు కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.