లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్‌ఐలు

ఒక సైబర్‌ క్రైం కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఇద్దరు ఎస్‌ఐలు ఏసీబీ వలలో చిక్కారు. బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఎల్బీనగర్‌ సైబర్‌క్రైం పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి సైబర్‌ నేరగాళ్లు దోచుకున్న రూ. 2లక్షల నగదు చేరింది. ఆ తర్వాత ఆ డబ్బును నేరగాళ్లు మరో ఖాతాకు మళ్లించారు. ఈ వ్యవహారంపై రాచకొండ సైబర్‌క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసును దర్యాప్తు చేస్తున్న ఏఆర్‌ఎ్‌సఐలు ప్రమోద్‌గౌడ్‌, జతావత్‌ బాబులు.. సదరు ఖాతాదారుడిని పిలిపించి సైబర్‌ మోసంలో మ్యూల్‌ అకౌంట్‌గా ఉపయోగపడినందున తనకు కేసుతో సంబంధం ఉందని, అరెస్ట్‌ చేస్తామని బెదిరించారు. అయితే, అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చి, 41ఏ సీఆర్‌పీసీ నోటీసుతో సరిపెట్టేందుకు రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరకు లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్న బాధితుడు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ సూచనల మేరకు సోమవారం ఎల్బీనగర్‌ చౌరస్తాలో నగదు అందజేస్తుండగా, అక్కడే ఉన్న అధికారులు ఇద్దరు ఐస్‌ఐలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.