డెక్కన్‌ సిమెంట్స్‌ పరిశ్రమలో అటవీశాఖ అధికారుల విచారణ

  • ఉన్నతాధికారులకు నివేదిస్తాం: జిల్లా అటవీశాఖ అధికారి సతీష్ కుమార్
  • తూతూ మంత్రంగా విచారణ జరిపారని ఫిర్యాదుదారు అసంతృప్తి

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానీపురం గ్రామంలో గల డెక్కన్‌ సిమెంట్స్‌ పరిశ్రమలో అటవీ భూముల ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుతో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) ఆదేశాల మేరకు జిల్లా ఫారెస్ట్‌ అధికారి(డీఎఫ్ఓ) సతీశ్‌కుమార్‌ సోమవారం డెక్కన్‌ సిమెంట్స్‌ పరిశ్రమ, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. డెక్కన్‌ సిమెంట్స్‌ ఫ్యాక్టరీపై ఫిర్యాదు చేసిన పసుపులేటి సురేశ్‌ సమక్షంలో జిల్లా అటవీశాఖ అధికారులు తనిఖీలో పాల్గొన్నారు. అటవీ భూమి ఆక్రమిత స్థలంలో ఉన్న శాశ్వత నిర్మాణాలను పరిశీలించామని డీఎఫ్ఓ తెలిపారు. వీటి ఫోటోలు, వీడియోలు, పాత్రలతో సహా పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని పేర్కొన్నారు. ఈ తనిఖీలకు స్థానిక మీడియాను అనుమతించలేదు. డెక్కన్‌ ఫ్యాక్టరీ అవకతవకలపై జిల్లా ఫారెస్ట్‌ అధికారులు తూ తూ మంత్రంగా విచారణ జరిపారని ఫిర్యాదుదారు పసుపులేటి సురేశ్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. అటవీ, మైనింగ్ భూముల మధ్య హద్దురాళ్ళు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. డీఎఫ్ఓ నివేదికపై తనకు విశ్వాసం లేదని.. ఈ అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని వెల్లడించారు. విచారణ అనంతరం ఫ్యాక్టరీ ఎదుట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డెక్కన్‌ ఫ్యాక్టరీ అటవీ భూములను ఆక్రమించిందని తాను కేంద్ర సాధికారత కమిటీకి చేసిన ఫిర్యాదు మేరకు ఈ రోజు విచారణ జరిగిందని తెలిపారు. ఆక్రమణను పట్టించుకోవడంలేదని అటవీశాఖ అధికారులపై ఫిర్యాదు చేస్తే వారితోనే విచారణ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విచారణలో అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ప్రతినిధులు, ఫిర్యాదుదారుడు సురేశ్ పాల్గొన్నారు.

డెక్కన్ సిమెంట్ పరిశ్రమ అటవీ భూముల అక్రమణకు పాల్పడినట్లు గతంలో వచ్చిన ఫిర్యాదులతో కలెక్టర్ అధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారించింది. సదరు పరిశ్రమ 8.02 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించి రైల్వేలైన్ తో పాటు ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది. అయితే ఆ అభూమిని తాము పట్టాదారుల నుంచే కొనుగోలు చేశామని డెక్కన్‌ సిమెంట్స్‌ పరిశ్రమ ప్రతినిధులు వాదించారు. చివరకు 2023లో కేంద్ర అటవీ శాఖకు రూ. 8 కోట్లు చెల్లించి ఆ భూమిని పరిశ్రమ క్రమబద్దీకరించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.