రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆరోగ్య పరీక్షలు: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో అలసత్వం వహించవద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమ పురోగతి, అమలు తీరుపై బుధవారం ఆయన సెక్రటేరియట్ నుంచి ఆరోగ్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సెక్రటేరియట్ నుంచి ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ పాల్గొనగా.. సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ సహా అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. టెస్టుల కోసం గ్రామాల నుంచి మహిళలను హాస్పిటల్స్‌కు తీసుకురావడానికి, పరీక్షల అనంతరం వారిని తిరిగి సురక్షితంగా ఇళ్ల వద్ద దింపడానికి వాహనాలను సమకూర్చాలని సెర్ప్‌ అధికారులకు సూచించారు. హాస్పిటల్స్‌లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎక్కువసేపు వేచి ఉండే అవసరం లేకుండా అవసరమైన మేర డాక్టర్లు, సిబ్బందిని అందుబాటులోకి ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. కుర్చీలు, తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. ఒకేరోజు ఎక్కువ మందిని హాస్పిటల్‌కు తరలించి, వారికి ఇబ్బంది కలిగించొద్దన్నారు. ఒక పద్ధతి ప్రకారం షెడ్యూల్‌ మెయింటేయిన్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్‌లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే, వారికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే చికిత్స ప్రారంభించాలన్నారు. స్క్రీనింగ్ జరిగే అన్ని హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లలో అవసరమైన మేర సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. మహిళల నుంచి రక్త నమూనాల సేకరణ మొదలుకొని.. వాటిని ల్యాబ్‌లకు చేర్చే వరకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, సాంపిల్స్ దెబ్బతినకుండా పక్కాగా కోల్డ్ చైన్ ప్రోటోకాల్స్‌ మెయింటైన్ చేయాలన్నారు. ల్యాబ్‌లో నమూనాల వివరాలు (డేటా) ఎంటర్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు దొర్లకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి హెచ్చరించారు. అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించి స్క్రీనింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడైనా చిన్నపాటి లోపాలు తలెత్తితే, వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని విభాగాల మధ్య పక్కా సమన్వయం ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ – ముఖ్యాంశాలు:
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం ఈ ప్రణాళికను రూపొందించింది. నాన్-కమ్యూనికబుల్ వ్యాధులను ముందుగానే గుర్తించి, మెరుగైన వైద్యం అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
• 46 లక్షల మంది.. 30 రకాల పరీక్షలు: రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 542 మండలాల పరిధిలో ఉన్న సుమారు 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో మహిళకు రక్తహీనత (అనీమియా), మధుమేహం, బీపీ, థైరాయిడ్, కాలేయం, కిడ్నీ పనితీరు తదితర 30 రకాల (జనరల్ మరియు ల్యాబ్) ఆరోగ్య పరీక్షలు చేస్తారు.
• రెండు దశల్లో అమలు: తొలి దశలో ప్రతి జిల్లాలోని 5 మండలాల్లో ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. మౌలిక వసతులు, సిబ్బంది లభ్యత ఆధారంగా రెండో దశలో మిగిలిన అన్ని మండలాలకు దీనిని విస్తరిస్తారు.
• సెర్ప్, వైద్యశాఖ సమన్వయం: సెర్ప్ (SERP) ఆధ్వర్యంలో మహిళలను సమీపంలోని పీహెచ్‌సీలకు తరలిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్‌ సెంటర్లలో రిజిస్ట్రేషన్, జనరల్ చెకప్, బ్లడ్ శాంపిల్స్ కలెక్షన్ జరుగుతుంది. అక్కడినుంచి టీ-డయాగ్నస్టిక్స్‌కు శాంపిల్స్ తరలించి, అక్కడ పరీక్షలు చేస్తారు.
• పేపర్‌లెస్ డిజిటల్ హెల్త్ రికార్డులు: లబ్ధిదారుల ఆరోగ్య సమాచారాన్ని పదిలంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరికీ క్యూఆర్ (QR) కోడ్ అనుసంధానంతో (ABHA ID ద్వారా) డిజిటల్ హెల్త్ రికార్డులను సృష్టించి, ఈ-హెచ్ఎంఐఎస్ (e-HMIS) ప్లాట్‌ఫారమ్‌కు అనుసంధానిస్తారు. ఈ రిపోర్టులను నేరుగా లబ్ధిదారుల మొబైల్‌కు ఎస్ఎంఎస్ (SMS) రూపంలో, అలాగే ‘ఈ-ఆరోగ్యం’ (e-Aarogyam) యాప్ ద్వారా అందిస్తారు. ఈ డిజిటల్ డేటాబేస్ ద్వారా భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లినా.. మహిళలు తమ రిపోర్టులను కాగితాల రూపంలో తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే సులభంగా వైద్య సేవలు పొందే అవకాశం లభిస్తుంది.