ప్ర‌ధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్ల‌కు ప్ర‌ణాళిక‌లు: సీఎం రేవంత్ రెడ్డి

  • హైద‌రాబాద్ నుంచి నిర్దేశిత స‌మ‌యంలో చేరేలా ప్ర‌ణాళిక‌లు
  • బోధ‌నాసుప‌త్రులు, పెద్దాసుప‌త్రుల నిర్మాణాలు త్వ‌ర‌గా పూర్తి కావాలి
  • ప్ర‌భుత్వ శాఖ‌లు ఈవీ వాహ‌నాలే కొనుగోలు చేయాలి..
  • ఆర్ అండ్ బీ, ర‌వాణా శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: ప్ర‌ధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహ‌నాలు వెళ్ల‌కుండా చూడ‌డంతో పాటు స‌ర‌కు ర‌వాణా వాహ‌నాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని సీఎం అన్నారు. జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో ఆర్ అండ్ బీ శాఖ‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. ఇప్ప‌టికే ఆయా జిల్లా కేంద్రాల‌కు స‌మీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాల‌న్నారు. ఆయా జిల్లా కేంద్రాల నుంచి రింగు రోడ్ల‌కు అనుసంధానించేలా రేడియ‌ల్ రోడ్లు నిర్మించాల‌ని సీఎం తెలిపారు. జాతీయ ర‌హ‌దారుల‌కు రింగు రోడ్ల‌ను అనుసంధానించే అంశంపై అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం ఆదేశించారు. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జున సాగ‌ర్ చేరేందుకు గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే నిర్మాణంలో ఉన్న ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని, అవ‌స‌ర‌మైన నూత‌న ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌న్నారు. బోధ‌నాసుప‌త్రులు, ఇత‌ర పెద్దాసుప‌త్రుల నిర్మాణ‌ల‌ను త్వ‌రగా పూర్తి చేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ‌నివాస‌రాజు, ఆర్ అండ్ బీ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహ‌న్ నాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాలుష్య ర‌హిత ర‌వాణాయే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇక నుంచి ప్ర‌భుత్వంలోని ఏ శాఖైనా త‌ప్ప‌నిస‌రిగా ఎల‌క్ట్రానిక్ వాహ‌నాల‌నే కొనుగోలు చేయాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. క్యూర్ ప‌రిధిలో ప్ర‌భుత్వ శాఖ‌ల ప‌రిధిలో అద్దెల‌కు తీసుకునే వాహ‌నాలు సైతం ఈవీలే ఉండాల‌ని సీఎం తెలిపారు. ర‌వాణా శాఖ‌లోని మాన్యువ‌ల్ ప‌ద్ధ‌తులకు స్వ‌స్తి చెప్పాల‌ని.. మొత్తం ఆన్‌లైన్‌లోనే కార్య‌క‌లాపాలు కొన‌సాగించాల‌ని సీఎం ఆదేశించారు. ఆర్‌టీవో కార్యాల‌యాలు అద్దె భ‌వ‌నాల్లో కొన‌సాగడానికి వీల్లేద‌ని, వెంట‌నే సొంత‌ భ‌వ‌నాల నిర్మాణాలకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. రోడ్డు ప్ర‌మాదాల‌పై అవ‌గాహ‌న పెంచాల‌ని… ఇందుకు షార్ట్ ఫిల్మ్‌లు ప్ర‌ద‌ర్శించాల‌ని సీఎం సూచించారు. శంషాబాద్ స‌మీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభ‌మ‌య్యే ప్రాంతంలో అధునాత‌న బ‌స్ టెర్మిన‌ల్ కు స్థ‌లం కేటాయిస్తామ‌ని.. అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని సీఎం ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ‌నివాస‌రాజు, ర‌వాణా శాఖ కమిష‌న‌ర్ ఇలంబ‌ర్తి, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.