ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లనూ స్పీకర్ ప్రసాద్‌కుమార్ డిస్మిస్ చేశారు. దానంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి.. కడియంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో స్పీకర్ మరోసారి విచారణ చేపట్టారు. దానం, కడియం పార్టీ మారినట్లుగా పిటిషన్‌దారులు సరైన ఆధారాలు సమర్పించని నేపథ్యంలో వారి పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ఆయన తీర్పును వెలువరించారు. వాస్తవానికి దానం, కడియంతో పాటుగా మరో 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇటు ఆయా పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలని స్పీకర్‌కు సూచించాలంటూ సుప్రీం కోర్టులోనూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సూచన మేరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ప్రక్రియను స్పీకర్ చేపట్టారు. దానం, కడియం మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై తొలుత విచారణను పూర్తి చేశారు. వారు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని తేల్చిన స్పీకర్.. ఆయా పిటిషన్లను డిస్మిస్ చేశారు. దానం, కడియంలపై పిటిషన్లపై విచారణ ప్రక్రియను పూర్తిచేసేందుకు ఈనెల 12 వరకూ సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిపై దాఖలైన పిటిషన్లపైనా విచారణ ప్రక్రియను పూర్తి చేసిన స్పీకర్.. ఆయా పిటిషన్లనూ తాజాగా డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అసెంబ్లీ వెబ్‌సైట్‌లో తీర్పు కాపీ పెట్టనున్న ట్లు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. మరోవైపు.. పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా తీర్పు కాపీ కూడా వెలువడిన వెంటనే హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సమాచారం.