ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణాకు ఐకాన్: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • 1000 కోట్లతో అభివృద్ధికీ రూట్ మ్యాప్
  • నిధులు మంజూరు చేయడం అభినందనీయం
  • ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక ఐకాన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ఉండడం మనకెంతో గర్వకారణమని ఆయన చెప్పారు. అంతటి పేరెన్నికగన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని తాను కాంక్షిస్తున్నానని ఆయన చెప్పారు. గురువారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విభాగంలో ఆయన నిర్మాణ్-26 సాంకేతిక సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 1917 లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. అందుకు కొనసాగింపుగా 1929 లో విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రారంభం అయిన ఇంజినీరింగ్ కళాశాల యావత్ భారతదేశంలోనే అత్యంత ప్రాశస్త్యమైన కళాశాలలలో ఆరవ స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. అంతటి ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయం అభివృద్ధికీ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించడమే కాకుండా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఏకంగా 1,000 కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు.

అంతర్జాతీయ స్థాయిలో ఈ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం అని అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. విశ్వవిద్యాలయంలో అవసరమైన అధ్యాపకుల భర్తీ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో చర్చించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇక్కడి నుండి ఎంతో మేధో సంపద ఉత్పత్తి అయిందని ఆ మేధస్సు ప్రపంచ స్థాయిలో అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న మెజారిటీ ఇంజినీర్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండే ఎదిగిన వారు అని,అంతే గాకుండా గల్లీ నుండి డిల్లో స్థాయికి ఎదిగిన నేతలు,క్రీడాకారులు,ఉన్నత పదవులు చేపట్టిన వారి అడుగులు ఇక్కడి నుండే మొదలు అయ్యాయని ఆయన చెప్పారు. అటువంటి విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలుచోవడమే కాకుండా విద్యార్థులు చేసిన త్యాగాలు ఇక్కడ ప్రస్తావనర్హమే అని భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలలో కుడా భాగస్వామ్యం కావాలని ఆయన ఉద్బోధించారు. ఇంజినీరింగ్ విభాగం గురుంచి ఆయన ప్రస్తావిస్తూ తెలంగాణా రాష్ట్ర అభివృద్ధిలో ఇంజినీరింగ్ విభాగం ముఖ్య భూమిక పోషిస్తుందని ఆయన చెప్పారు.

నిజాంసాగర్, నాగార్జునసాగర్,శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టులతో పాటు ఎస్.ఎల్.బి.సి,దేవాదుల వంటి ఆధునిక ప్రాజెక్టులు ఇంజినీరింగ్ ప్రతిభకు అద్దం పడుతున్నాయన్నారు.
సివిల్ ఇంజినీరింగ్ విభాగము విద్యార్థులకు ప్రాక్టికల్స్ పాఠాలుగా ఉపయోగ పడుతాయని ఆయన చెప్పారు. భవిష్యత్ లో స్థిరమైన అభివృద్ధి,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం,జలవనరుల సమగ్ర నిర్వహణ తో పాటు చెక్ డ్యామ్ ల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంజినీర్లు ప్రాజెక్టుల నిర్మాణాలకు మాత్రమే పరిమితం కాకుండా వాటి భద్రత,నిర్వహణ బాద్యతలు కుడా ఇంజినీర్లకు ఉంటాయన్నారు. నిర్మాణ్-26 వంటి సాంకేతిక సదస్సులు విద్యార్థులకు పరిశోధన,సృజనాత్మక తాను పెంపొందించే వేడికలని ఆయన చెప్పారు. మన నిర్మాణాలు కేవలము కట్టడాలకే పరిమితము కాకుండా ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు దోహద పడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్బోధించారు.