ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీని ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • 61,125 మంది రైతులకు లబ్ధి – జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా వినూత్న కార్యక్రమం

రాష్ట్రంలోని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ చేసే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్ర సచివాలయం నుండి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 క్లస్టర్లలో ఈ పంపిణీ జరుగుతుంది. ప్రతి క్లస్టర్‌కు 125 మంది చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, గుర్తింపు కోసం ఈ కిట్‌లో క్లాత్ బ్యాగ్, క్షేత్ర దర్శిని డైరీ, గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను మరియు చిన్న ప్యాకెట్ డైరీ వంటి వస్తువులు ఉంటాయి. సచివాలయంలో మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, ఆయా జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు ఈ కిట్లను పంపిణీ చేస్తారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.