ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో స్కాం జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బియ్యం ఎగుమతి చేయడానికి పెట్టుకున్న అడ్వైజర్ ఘరానా మోసగాడు అని విమర్శించారు. ఈడీ, సీబీఐ కేసులో నమోదైన వ్యక్తిని అడ్వైజర్‌గా పెట్టుకున్నది నిజామా కాదా అని ప్రశ్నించారు. ఈ అడ్వైజర్ ఇచ్చిన సలహా వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది నిజం కాదా అని నిలదీశారు. పది లక్షల మెట్రిక్ టన్నులు ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తాం అని ఎంవోయూ చేసుకున్నాం అని, ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అని, మా విజయం అని గొప్పలు చెప్పుకున్నారు.. ఇప్పుడు ఇదే పెద్ద స్కాంగా మారిందని అన్నారు.
లక్ష మెట్రిక్ టన్నులు పిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తామని ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు. నాఫెడ్ అనే సంస్థ కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే డబ్బులు చెల్లిస్తామని అంటే.. ఆ సంస్థకు కాకుండా ప్రైవేటు సంస్థకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 27,500 మెట్రిక్ టన్నుల వద్దనే ఎందుకు ఆగిపోయారని ప్రశ్నించారు. మరో 7500 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్టులో ముక్కిపోతున్నాయని తెలిపారు. 7500 మెట్రిక్ టన్నులు ఏడాదిగా పోర్టులో ఉంటే గోదాం, హ్యాండ్లింగ్ చార్జీల భారం పడవా అని ప్రశ్నించారు. ఆ 7500 మెట్రిక్ టన్నుల బియ్యం ముక్కిపోయాయా? పురుగులు పడ్డాయా అని అడిగారు. వాటాలు తేలకపోవడమే ఎగుమతి ఆగిపోవడానికి కారణం కాదా అని ప్రశ్నించారు.