నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం: హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగ‌నాథ్

  • జ‌ల‌వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త‌
  • చెరువుల‌ను పున‌రుద్ధ‌రిస్తున్నామ‌న్న‌ హైడ్రా క‌మిష‌న‌ర్‌
  • జేఎన్‌టీయూలో వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే వేడుక‌ల్లో హైడ్రా క‌మిష‌న‌ర్‌

ప్ర‌స్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జ‌రుగుతున్నాయి. జ‌ల‌వ‌న‌రులపై యుద్ధాల వ‌ర‌కూ వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. నీటి యుద్ధాల‌కు ఆస్కారం లేకుండా మేలుకొందామ‌ని అన్నారు. జేఎన్‌టీయూలో ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియంతో క‌లసి ఇండియ‌న్ సొసైటీ ఆఫ్ జియోమేటిక్స్‌ – హైద‌రాబాద్ చాప్ట‌ర్ సోమ‌వారం నిర్వ‌హించిన వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే ఉత్స‌వాలలో హైడ్రా క‌మిష‌న‌ర్ మాట్లాడారు. న‌గ‌ర జ‌నాభా అనూహ్యంగా పెరుగుతోంది. 1.60 కోట్లున్న న‌గ‌ర జ‌నాభా 2050 నాటికి 3 కోట్ల‌కు దాటే అవ‌కాశం ఉంది. ఇలా పెరుగుతున్న జ‌నాభా అవ‌స‌రాల‌మేర‌కు న‌గ‌రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ముందు చూపుతో న‌గ‌రంలోని గొలుసుక‌ట్టు చెరువుల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని నిర్ణ‌యించింద‌ని.. ఆ దిశ‌గా హైడ్రా వ‌డివ‌డిగా అడుగులేస్తోంద‌ని చెప్పారు. మొద‌టి ద‌శ 6 చెరువులో మూడు ప్రారంభ‌మ‌వ్వ‌గా.. మిగ‌తా 3 చెరువులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. రెండోద‌శ‌లో మ‌రో 18 చెరువుల‌ను రెండో ద‌శ‌గా చేప‌ట్టామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పారు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన న‌గ‌రంలో వ‌ర్షాకాలం వ‌ర‌ద‌లు.. వేస‌వి కాలం నీటి ఎద్ద‌డి స‌ర్వ సాధార‌ణంగా మారింది. గొలుసుక‌ట్టు చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌తో వ‌ర‌ద‌ల‌కు చెక్ పెట్ట‌డ‌మే కాకుండా.. న‌గ‌రంలో భూగ‌ర్భ జ‌లాలు పెర‌గ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

క‌బ్జాల‌కు చెక్ పెడుతున్న హైడ్రా..
ఎన్ ఆర్ ఎస్ సీ (నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌) డేటా ప్ర‌కారం 1975 నుంచి 2023 లోపు న‌గ‌రంలో 61 శాతం చెరువులు మాయ‌మ‌య్యాయ‌ని.. మ‌రో 15 ఏళ్ల‌లో ఉన్న‌వి కూడా క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థ‌తి ఉంద‌ని హెచ్చ‌రించిన విష‌యాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. 1300ల చెరువుల్లో 700ల చెరువులు మాయం అవ్వ‌గా.. ఉన్న చెరువులు 60 శాతం క‌బ్జాకు గర‌య్యాయ‌ని అన్నారు. ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించాల‌ని పేప‌ర్ల‌లో ఉంటుంది. లిఖిత‌పూర్వ‌క ఆదేశాలుంటాయి. కాని అవి అమ‌లు కాని ప‌రిస్థితి గ‌తంలో ఉండేది. మాధాపూర్‌లోని త‌మ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ ప‌రిధిలోని ఎన్ క‌న్వెన్ష‌నే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. హైడ్రా వెంట‌నే ఆ ప‌ని చేసి 14 ఎక‌రాలకు కుంచించుకుపోయిన త‌మ్మిడికుంట‌ను 29 ఎక‌రాల‌కు విస్త‌రించింది. ఇదే ప‌రిస్థితి న‌గ‌రంలోని అన్ని చెరువుల‌దీ. ఈ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన‌ప్ప‌డు కొంత‌మంది విమ‌ర్శించారు. నేడు వారే అభినందిస్తున్నారు. వేలాది మంది చెరువుల చెంత సేద‌దీరుతున్నారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు పిక్నిక్ స్పాట్‌గా మారుతున్నాయి. హైడ్రా చ‌ర్య‌ల వ‌ల్ల అంద‌రికీ చెరువుల ఎప్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ అంటే తెలిసింది. ఇప్ప‌డు రియ‌ల్ట‌ర్లు చెరువుల ఎప్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ ప‌రిధిలో ఇళ్లు నిర్మించ‌డంలేదు. ప్ర‌జ‌లు కొన‌డానికి ముందుకు రావ‌డంలేదు. హైడ్రా చ‌ర్య‌ల‌తోనే ఇది సాధ్య‌మైందన్నారు.

ప‌ర్యావ‌ర‌ణహిత‌మైన న‌గ‌ర‌మే ల‌క్ష్యంగా..
భ‌విష్య‌త్ త‌రాల అవ‌స‌రాల‌మేర‌కు చెరువులు, నాలాల‌ను ప‌రిర‌క్షించుకంటూ.. ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌మైన న‌గ‌ర నిర్మాణ‌మే ల‌క్ష్యంగా హైడ్రా ప‌ని చేస్తోంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. బ‌డాబాబుల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి 1350 ఎక‌రాల ప్ర‌భుత్వ‌, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన భూముల‌ను కాపాడాం. చెరువుల‌ను పున‌రుద్ధ‌రిస్తున్నాం. క‌బ్జాల ప‌ట్ల మౌనంగా ఉంటే మ‌న మ‌నుగ‌డే ప్ర‌మాద‌క‌రం అవుతుంది. ప్ర‌స్తుతానికి కొంత‌మందికి ఇబ్బందిగా ఉన్నా..ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల దృష్ట్యా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందుకు జేఎన్‌టీయూ, ఎన్ ఆర్ ఎస్ సీ, స‌ర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థ‌ల స‌హ‌కారాన్ని తీసుకుంటున్నామ‌ని చెప్పారు. సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ నాలా ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి 27 కాల‌నీల మున‌క‌ను త‌ప్పించాం. అమీర్‌పేట‌లో కూడా వ‌ర్షం ప‌డితే న‌డుం లోతు నీళ్లు నిలిచేది.. అక్క‌డ నాలాల్లో పూడిక‌లు తీయ‌డంతో వ‌ర‌ద ముప్పు త‌ప్పింద‌న్నారు. జేఎన్‌టీయూ వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొ. టి. కిష‌న్ కుమార్ రెడ్డి, జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ ప్రొ. జీవీ న‌ర‌సింహారెడ్డి, జీపీబీఏఏఎస్ ఆర్ ఐ డైరెక్ట‌ర్ డా. కె. మృత్యుంజ‌య‌ రెడ్డి, సెంట‌ర్ ఫ‌ర్ ఎన్విరాన్‌మెంట్ విభాగం ప్రొఫెస‌ర్లు టి. విజ‌య‌ల‌క్ష్మి, వి. హిమ‌బిందు మాట్లాడుతూ.. తాగు నీటి వ‌న‌రుల‌ను కాపాడుకోవాల్సిన అవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారు. ఆ దిశ‌గా హైడ్రా చేస్తున్న‌కృషిని అభినందించారు. క‌బ్జాలు తొల‌గించ‌డం, చెరువుల‌ను పున‌రుద్ధ‌రించ‌డం హైడ్రా చేసి చూపింద‌న్నారు.