హైదరాబాద్: వేగంగా మార్పు చెందుతున్న డిజిటల్ యుగంలోను ఆకాశవాణి వార్తలు తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించు కున్నాయని, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్, శ్రీ రాజీవ్ కుమార్ జైన్ అన్నారు. సంప్రదాయ రేడియో వార్తా ప్రసారంతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రత్యేకత చాటుకుంటుందని చెప్పారు. ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులోని కవాడీ గూడ సిజిఓ టవర్స్ కాన్ఫరెన్స్ హాల్లో పార్ట్‌టైమ్ కరస్పాండెంట్స్, క్యాజువల్ న్యూస్ ఎడిటర్స్, న్యూస్ రీడర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆకాశవాణి హైదరాబాద్ రీజినల్ న్యూస్ యూనిట్ హెడ్, డిప్యూటీ డైరెక్టర్ MS మహేష్ అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, ఆకాశవాణి తన కరస్పాండెంట్లకు ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వారి వృత్తి మెలకువలను పెంపొందిస్తుందని అన్నారు. సోషల్ మీడియా ఒత్తిడితో వార్తలను తక్షణమే ప్రసారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా, విశ్వసనీయతను పోగొట్టుకోకుండా, ఆ సవాలును అధిగమించాలని రాజీవ్ కుమార్ జైన్ కరస్పాండెంట్లకు సూచించారు. తాము సేకరించిన సమాచారాన్ని పరిశీలించి, నిర్ధారించుకోవాల్సిన బాధ్యత కరస్పాండెంట్లపై ఉందన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం వల్ల వార్తలకు నిర్వచనమే మారిపోయిందనీ పేర్కొన్నారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌గా ఆకాశవాణిలో ఖచ్చితత్వం, ధర్మనిష్టను పాటించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. PIB హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ, వాట్సప్ యూనివర్సిటీ ద్వారా వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో PIB లో ప్రారంభించిన ఫ్యాక్ట్ చెక్ విభాగం గురించి వివరించారు . ప్రభుత్వ కమ్యూనికేటర్లుగా విలేకరులు క్షేత్రస్థాయి అభివృద్ధి నివేదికలపై దృష్టి సారించాలని సూచించారు. ఆకాశవాణి హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, క్లస్టర్ హెడ్ హరిసింగ్ మాట్లాడుతూ, ఆకాశవాణి విశ్వసనీయతకు, సమగ్రతకు, సంపూర్ణతకు మారుపేరు అని చెప్పారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని విశ్వసనీయతను పోగొట్టుకోకుండా ఆకాశవాణి ప్రఖ్యాతిని అలాగే నిలబెట్టాలని కరస్పాండెంట్లకు సూచించారు. ఆకాశవాణి హైదరాబాద్ రీజినల్ న్యూస్ యూనిట్ హెడ్, డిప్యూటీ డైరెక్టర్ MS మహేష్ మాట్లాడుతూ.. 1957 ఫిబ్రవరి 7న ఆకాశవాణి లో వార్తా విభాగం ప్రారంభమైందని గుర్తు చేశారు. 1965లో ఉర్దూ శ్రోతలను దృష్టిలో ఉంచుకుని ఉర్దూ బులెటిన్ ప్రారంభించినట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా.. పలు అంశాలపై సీనియర్ జర్నలిస్టులు, ప్రముఖులు శిక్షణా తరగతులు నిర్వహించారు. “మారుతున్న మీడియా వాతావరణంలో వార్తల సేకరణ, కంటెంట్ తయారీ” అనే అంశంపై ఆర్టీఐ మాజీ కమిషనర్, పీపుల్స్ పల్స్ డైరెక్టర్ ఆర్. దిలీప్ రెడ్డి అవగాహన కల్పించారు. “సోషల్ మీడియా యుగంలో కంటెంట్ వినియోగం” అనే అంశంపై హిందూ బిజినెస్ లైన్ అసోసియట్ ఎడిటర్ Dr. కూర్మనాథ్ వివరించారు. “న్యూస్ రూమ్ పరిణామం, కంటెంట్ బదిలీ, మారుతున్న కంటెంట్ మూలాల స్వభావం” అనే అంశంపై ఐ న్యూస్ సీఈఓ, చీఫ్ ఎడిటర్ ఏ కే సాగర్ విశ్లేషించారు. అలాగే, “ఫాక్ట్ చెక్, సోషల్ మీడియా హ్యాండిల్స్ మెరుగుపరచడానికి సోషల్ మీడియా టెక్నిక్స్” అనే అంశంపై ఫాక్ట్ లీ సంస్థ ఆపరేషన్స్ హెడ్ భరత్ వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా మారుతున్న మీడియా పరిస్థితులలో ఆకాశవాణి విలేకరులకు కొత్త దిశానిర్దేశం లభించింది.