- ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జూన్ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త పథకాల గురించి వివరించాలి
- ప్రజా పాలన -ప్రజా ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ప్రజా పాలన -ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రజాభవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభలు నిర్వహించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం ఆదేశించారు. మొదట ముఖ్యమంత్రి గారి సందేశం వినిపించి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పెద్ద ఎత్తున చదివి వినిపించాలని సూచించారు. రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు, 200 యూనిట్ల విచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సాధ్యమైనంతవరకు గ్రామ సభలో చదివి వినిపించాలని ఆదేశించారు. ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు జూన్ 2 నుంచి అందరికీ జీవిత బీమా అమలు చేయబోతున్న విషయాన్ని వివరించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం ఆ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు గ్లాస్ పాలు, మూడు రోజులపాటు రాగి జావా అందిస్తున్న విషయాన్ని వివరించాలన్నారు. ఇంటర్ కళాశాలల విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసేలా వివరించాలన్నారు. వీటిని వివరించే క్రమంలో సాంస్కృతిక శాఖ, పౌర సంబంధాల శాఖ సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు. గ్రామపంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నాం, గ్రామాల వారిగా విడుదలైన నిధుల వివరాలను అందుబాటులో పెట్టుకుని గ్రామసభ రోజు ఆ గ్రామానికి ఎంత చేరిందో ప్రకటించాలి అన్నారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం అవుతున్న తీరును ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ మరియు ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్ ల నుంచి సమాచారం సేకరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాదు మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవా రంగాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.