కొహెడ పండ్ల మార్కెట్ పై బిఆర్ఎస్ నాయకులది దుష్ప్రచారం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆరోపణలు సత్యదూరం
  • చెడు ఆరోపణలు మాని, మంచి ఆలోచనలతో ప్రభుత్వం దగ్గరికి రావాలి

కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, రాజకీయ స్వార్థం కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కోహెడలో ప్రతిపాదిత ఫ్రూట్ మార్కెట్‌కు సంబంధించిన భూములను అమ్మే ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని ఆధునిక సదుపాయాలతో మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. ఈ మార్కెట్ అభివృద్ధికి రూ. 3087 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశామని, గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అది కేవలం రూ. 399.96 కోట్లకు మాత్రమే పరిమితమైందని గుర్తు చేశారు.

2011లో కాంగ్రెస్ ప్రభుత్వం కోహెడలో సర్వే నంబర్లు 507/2, 548/2లలో ఉన్న 178.09 ఎకరాల భూమిని పండ్ల మార్కెట్ కోసం కేటాయించినప్పటికీ, గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని మంత్రి విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కోహెడ మార్కెట్‌ను సమీకృతంగా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభించిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలనే లక్ష్యంతో, ఇప్పటికే కేటాయించిన భూమికి అదనంగా సర్వే నంబర్ 167/1లో ఉన్న 239 ఎకరాల భూమిని మార్కెటింగ్ శాఖకు అప్పగించేందుకు 23.02.2026న మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అదే సమయంలో అగ్రి ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతు ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మాజీ మంత్రి హరీశ్ రావు కోహెడ మార్కెట్ స్థలాన్ని సందర్శించి “ఈ భూములను ఇతర సంస్థలకు కేటాయిస్తారు” అంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని మంత్రి స్పష్టం చేశారు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయ ప్రయత్నమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు శ్రేయస్సు కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, గతంలో రైతులను పట్టించుకోని వారు ఇప్పుడు విమర్శలు చేయడం వారి రాజకీయ ప్రయోజనాల కోసమేనని వ్యాఖ్యానించారు.

త్వరలోనే కోహెడలో ఆధునిక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి మార్కెట్ ఏర్పాటు చేసి, రైతుల ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే టీజీఐఐసీకి కేటాయించిన భూమిలో పండ్ల ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అంతర్జాతీయ ఎగుమతులకు మార్గం సుగమం చేస్తామని పేర్కొన్నారు. ఈ రెండు వేర్వేరు విధాలుగా మార్కెట్లు పనిచేస్తాయని, ఒకటి హోల్‌సేల్ వ్యాపారం కోసం గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ పరిధిలో కొనసాగుతుందని, మరొకటి జాతీయ-అంతర్జాతీయ ఎగుమతుల కోసం ప్రత్యేకంగా పని చేస్తుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, పండ్ల సాగును ప్రోత్సహించడం, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం కల్పించడం – ఇవే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.