- 861 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
- రూ. 15 వేల కోట్లకు పైగా విలువైన భూమిని కాపాడిన ప్రభుత్వం
- కబ్జాలకు ఆస్కారం లేకుండా చుట్టూ ఫెన్సింగ్
- ముఖీం గెస్టు హౌస్తో పాటు ఫామ్ హౌస్ కూల్చివేత
నగర చరిత్రలో నిలిచిపోయే భారీ ఆపరేషన్‌ను ప్రభుత్వ యంత్రాంగం శనివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేని విదంగా 861ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులతో కలిసి హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ మార్కట్లో రూ. 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు ఇతర విభాగాలు ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఇప్పటికే ఇల్లు కట్టుకుని ఉన్న వారిని మినహాయించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు కట్టుకున్నపేదలు, సామాన్యులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఎప్పటికప్పుడు మైకులో అధికారులు మైకు ద్వారా ప్రకటించాయి. దీంతో పేదలంతా ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రా ఫెన్సింగ్ కార్యక్రమానికి సహకరించారు. ఇదే సమంలో అక్కడ పాత లే ఔట్లలోని ప్లాట్ల యజమానులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. మా లే ఔట్లను కాపాడుకోడానికి మేమంతా కోర్టుకు వెళ్లి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు.. కాదు లే ఔట్లు వేశాం ఆ భూమి మాది అని అక్కడి ప్లాట్ల యజమానులు కోర్టులో పోరాడుతున్నారు. మధ్యలో ఎం. ఎ. ముఖీం అనేటోడు వచ్చి అన్యాయంగా ఆ భూములను తెగనమ్ముకోడానికి ఇన్నాళ్లకు ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకట్ట వేసిందని హర్షం వ్యక్తం చేశారు.
ముఖీం గెస్టు హౌస్తో పాటు.. ఫామ్ హౌస్ నేలమట్టం
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూరంలోని సర్వే నంబరు 1 నుంచి 220 వరకూ ఉన్న ప్రభుత్వభూమిలో ఎలాంటి కట్టడాలు చేయరాదని 1998లో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఏమాత్రం లెక్క చేయకుండా 2006లో ఎం. ఎ. ముఖీం గెస్టు హౌస్ కట్టాడు. గెస్ట్ హౌస్‌తో పాటు మొత్తం 40 ఎకరాల పరిధిలో ఫార్మ్ హౌస్ నిర్మించాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి హద్దులు పెట్టాడు. ఇక అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా అవకాశం లేకుండా కాపలా పెట్టాడు. ఇక్కడితో ఆగకుండా అక్కడ భూములను తెగనమ్మడం ప్రారంభించాడు. దీంతో అక్కడి లే ఔట్లున్న వారు మళ్లీ కోర్టునాశ్రయించారు. ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని ఇరు పక్షాలకూ 2013లో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం నిర్మించిన 6 అంతస్తుల అపార్టుమెంట్‌ను కూల్చేసింది. స్విమ్మింగ్‌పూల్‌తో సహా విలాసవంతంగా నిర్మించుకున్న గెస్టు హౌస్తో పాటు అక్కడ నిర్మించిన గదులను ఇంటిని.. ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ను, గుర్రాలకోసం నిర్మించిన శాలలను తొలగించారు.
భూములు అమ్మకాలకు చెక్..
కోర్టు తీర్పులు పెండింగ్ ఉండగా.. ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముఖీంతో పాటు అతని అనుచరులు ఇష్టానుసారం అమ్మకాలు చేస్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం లెక్క చెయకుండా ప్లాట్లుగా అమ్మేస్తున్న వారికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి హైడ్రా చెక్ పెట్టింది. చట్టాలంటే భయం లేకుండా.. అధికారులను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా కబ్జాలు చేసి అక్కడ లావాదేవీలు నిర్వహిస్తున్నముఖీం కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య 861 ఎకరాలకు ఫెన్సింగ్ వేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో హైడ్రా యంత్రాంగం ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వందల కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన ముఖీంకు హైడ్రా చెక్ పెట్టింది. 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఇప్పటికే కొన్ని ఇళ్లు నిర్మాణం జరిగింది. పేదలు కట్టుకున్న ఇళ్లను మినహాయించి ఖాళీగా ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కాపాడింది.
ఈ భూమికి సంబంధించిన మరిన్ని వివరాలు..
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని 1 నుంచి 220 సర్వే నంబర్ల వరకూ 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
నిజాం పాలకులకు చెందినదిగా ఇది రికార్డుల్లో ఉంది. విలీన ప్రక్రియ ప్రకారం ప్రభుత్వ భూమిగా రికార్డులకెక్కింది.
2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ (W.A.No.10/98 & ఇతర కేసులు తేదీ: 04.07.2003) ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. అప్పటి జాయింట్ కలెక్టర్ 1263 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ప్రకటించారు.
1980 దశకంలో అక్కడ రెండు లే ఔట్‌లు వచ్చాయి. 495 ఎకరాలతో రాజగోపాల్‌నగర్ కాలనీ, 131 ఎకరాలతో విద్యుత్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లు వచ్చాయి.
1263 ఎకరాల భూమిలో 475 ఎకరాలు తమదంటూ ఓ కుటుంబం పట్టాలను చూపిస్తూ వస్తోంది. వీరంతా కోర్టును ఆశ్రయించి తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.
నిజాం పాలకలుదగ్గర దివాన్‌గా ఉన్న వ్యక్తి దగ్గర ముఖీం తండ్రి పని చేసేవాడని.. ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 19 ఎకరాల భూమి ముఖీం తండ్రికి సమకూరిందని స్థానికులు చెబుతున్నారు.
వాస్తవానికి ఇదంతా ప్రభుత్వ భూమే అయినప్పటికీ.. ముఖీం తండ్రికి చెందిన 19 ఎకరాల భూమిలో కూడా లే ఔట్ వేసి అమ్మేసినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఆ 19 ఎకరాలతో పాటు.. మరో 21 ఎకరాల మేర కబ్జా చేసి ఫామ్ హౌస్ నిర్మించినట్టు అక్కడి లే ఔట్ ప్లాట్ల యజమానులు ఆరోపిస్తున్నారు.
1998 లో ఈ భూమిపై హై కోర్టు స్టే విధించింది. 2013లో మళ్ళీ హై కోర్టు స్టే విధించింది.
1998లో స్టే ఆర్డర్ను పట్టించుకోకుండా తప్పుడు పత్రాలతో 2006లో గెస్ట్ హౌస్ను నిర్మించిన mukheem.
2013 స్టే ఆర్డర్ ను కూడా లెక్క చేయకుండా భూములను అమ్మేసిన mukheem.
2013 లో హైకోర్టు ( W.A.M.P. No.263/2013)ఇచ్చిన ఆదేశాల ప్రకారం, సంబంధిత భూములపై యాజమాన్యం కలిగిన లేదా ఆక్రమణలో ఉన్న ఎవరైనా ఆ భూముల స్వరూపాన్ని మార్చకూడదు, ధ్వంసం చేయకూడదు అని స్పష్టం చేసింది.
ఇలా కోర్టు వివాదాలు పెండింగ్‌లో ఉండగా.. మూడో వ్యక్తిగా ముఖీం అనే వ్యక్తి అక్కడి భూములు తెగనమ్మడం ప్రారంభించాడు. స్టే ఆర్డర్ను పట్టించుకోకుండా అక్కడ నిర్మాణాలు చేపట్టాడు.
40 ఎకరాల విస్తీర్ణంలో ముఖీం ఫార్మ్ హౌస్ నిర్మించారు. అందులో ఈత కొలను నిర్మించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
ప్రస్తుతం W.A. No.114, 115, 116/2013, 126/2013తో పాటు.. A.S. No.520/2010 కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉండి, తుది విచారణకు రానున్నాయి.
ఈ నేపథ్యంలో అక్కడి భూమిని కాపాడాలని అమీన్పూర్ తహసీల్దార్ HYDRAA కమిషనర్ నివేదిక సమర్పించారు.
హైకోర్టు (W.A.M.P. No.263/2013 తేదీ: 26.09.2013 న )ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకు యథాతథ స్థితిని కొనసాగిస్తూ, ఆక్రమణలను నివారించాలని కోరారు.
కంచె వల్ల స్థానిక గ్రామస్తులకు, ఐలాపురం తండా నివాసితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖాళీగా ఉన్న భూమిని కాపాడుతూ ఫెన్సింగ్ వేసింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న రిట్ అప్పీలు తుది నిర్ణయం వచ్చే వరకు, సంబంధిత భూములను యథాతథ స్థితిలో పరిరక్షించడంలో భాగంగా హైడ్రా ఈ చర్యలు తీసుకుంది.
ఎమ్మార్వోను బెదిరించినందుకు ఒకకేసు నమోదైతే.. లే ఔట్‌లోని ప్లాట్లు చూడడానికి వచ్చిన వారిని బెదిరించారంటూ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
ముఖీం మీద ఉన్న కేసుల నేపథ్యంలో అతని గన్ లైసెన్సును కూడా పోలీసులు రద్దు చేశారు. గన్‌ను కూడా తీసుకున్నారు.
రాజగోపాల్‌నగర్ కాలనీలో ముఖీం అమ్మేసిన ప్లాట్లలో కట్టిన ఇళ్లను, దుకాణాలను మొత్తం 250 వరకూ అప్పటి రెవెన్యూ అధికారులు 2023లో కూల్చేశారు.
యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ముఖీం అక్కడ భూములను తెగనమ్మి సొమ్ము చేసుకున్నాడు. గజం రూ. 10 వేల నుంచి 30 వేల చొప్పున 300ల ఎకరాల వరకూ అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు.
రెండు దశాబ్దాలుగా ఏం చేసినా తిరుగే లేదని వ్యవహరించిన ముఖీం అరాచకాలకు చెక్ పెట్టడంలో హైడ్రాకు రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులంతా సహకరించారు.