భూ వివాదాల ప‌రిష్కారంలో సువ‌ర్ణాధ్యాయం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • కుసుమంచిలో స‌ర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేష‌న్
  • స‌ర్వే(ఎల్‌.పి.ఎం), భూధార్ నెంబ‌ర్ల కేటాయింపు
  • భూమి హక్కులకు శాశ్వత భరోసా

హైదరాబాద్ : రైతు జీవితం భూమితో ముడిప‌డి ఉంద‌ని ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉన్న‌ప్పుడే అత‌ని జీవితం భద్రంగా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆ హక్కును సర్వే మ్యాప్‌తో, భూధార్ నెంబర్‌తో శాశ్వతంగా నిర్ధారించిన‌పుడే రైతుకు ధైర్యం, కుటుంబానికి భరోసా, భవిష్యత్తుపై నమ్మకం క‌లుగుతుంద‌ని అన్నారు. ఈ దిశ‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా బలోపేతం చేస్తూ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను ఈనెల 2వ తేదీ నుంచి నారాయ‌ణ‌పేట జిల్లా కొస్గి, ఖ‌మ్మం జిల్లా కుసుమంచి, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట‌, రంగారెడ్డి జిల్లా అమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లిలో ప్ర‌యోగాత్మ‌కంగా అమలు చేస్తున్నామ‌ని తెలిపారు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాప్ త‌ప్ప‌నిస‌రి అనే నిబంధ‌న‌ను భూభార‌తి చ‌ట్టంలో పొందుప‌రిచామ‌ని అదే విధంగా ఎవ‌రైనా స్వ‌చ్ఛందంగా వారి ఆస్తుల‌కు సంబంధించిన స‌ర్వే స‌ర్టిఫికేట్ కు కూడా ద‌రఖాస్తు చేసుకొని దృవీక‌రించుకోవ‌చ్చన్నారు. ఇందులో భాగంగా భూభార‌తి చ‌ట్టంలో పేర్కొన్న విధంగా రిజిస్ట్రేష‌న్‌కు స‌ర్వే మ్యాప్ ఉండాల‌న్న నిబంధ‌న‌ను ఈ ఐదు మండ‌లాల్లో అమ‌లు చేస్తున్నామ‌న్నారు.

మంగ‌ళ‌వారం నాడు ఖమ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని కుసుమంచి మండలంలో స‌ర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేష‌న్ చేసి చారిత్రాత్మ‌క‌మైన అడుగు వేశామ‌ని అన్నారు. స‌ర్వేమ్యాప్‌తో తొలి రిజిస్ట్రేష‌న్ అయిన సంద‌ర్బంగా మంత్రి స్పందిస్తూ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్ దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని అన్నారు. కుసుమంచి మండ‌లంలోని గట్టు సింగారం రెవెన్యూ గ్రామంలోని స‌ర్వే నెంబ‌ర్ 156/ఇ/1 లోగ‌ల ఒక ఎక‌రా నాలుగు గుంట‌ల భూమిని నేల‌కొండ‌ప‌ల్లి మండ‌లం ముత్తాపురం గ్రామానికి చెందిన చెందిన‌ భాగం కిషన్‌రావు అనే రైతు అదే గ్రామానికి చెందిన క‌ట్టా వెంక‌టేశ్వ‌ర‌రావుకు విక్ర‌యిస్తున్న సంద‌ర్బంగా త‌న భూమి హ‌ద్దులతో కూడిన‌ మ్యాప్ ను జ‌త‌చేసి కూసుమంచి త‌హ‌శీల్దార్‌ కార్యాల‌యంలో రిజిస్ట్రేష‌న్ చేశారు. దీనికి సంబంధించి ( భూ క‌మ‌త పటము-1, భూధార్ నెంబ‌ర్ 795GCHDCUPJ7H0) ను త‌హ‌శీల్ధార్ కేటాయించ‌డం జ‌రిగింది. ఇదే విధానాన్ని ద‌శ‌ల‌వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేసి భూవివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించేవిధంగా త‌మ ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌నిచేస్తుంద‌న్నారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం భూ వ్యవహారాల్లో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకొచ్చింద‌ని తెలిపారు. ప్రతి భూమికి ఖచ్చితమైన సర్వే మ్యాప్, ప్రత్యేక భూధార్ నెంబర్ కేటాయించడం ద్వారా యాజమాన్యంపై ఎలాంటి సందేహాలకు తావు లేకుండా చేస్తోంద‌ని భూభారతి పోర్టల్ ద్వారా ఈ సేవలను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చింద‌న్నారు. స‌ర్వే విష‌యంలో పాత విధానాల‌కు స్వ‌స్తి చెప్పి అధునాత‌న రోవర్ల‌ను వినియోగిస్తూ క‌చ్చిత‌త్వంతో స‌ర్వే పూర్తిచేయిస్తున్నామ‌ని తెలిపారు.