సంయమనం పాటించండి… సమ్మె విరమించండి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

  • ఆర్టీసీ కార్మికులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి

ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించి… సమ్మె విరమించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తప్పకుండా చర్చలు జరుపుతుందని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకునే అనాలోచిత చర్యలకు పాల్పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంతో కొత్త సమస్యలు వస్తాయని, ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలి కావొద్దని కోరారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెంటనే చర్చలకు ముందుకు రావాలని కార్మిక సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. కార్మికులు ఆత్మనిబ్బరంతో ఉండాలని… ప్రభుత్వం తో చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.