- ఎద్దు మృతి ఘటనపై శాంపిల్స్ సేకరణ
- – కాజీపల్లి పారిశ్రామికవాడలో పర్యటన.
- ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని పీసీబీ స్పష్టం
- బాధిత రైతు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తుల డిమాండ్
- మధ్యలోనే వెనుదిరిగిన ఇరిగేషన్ అధికారులు
గడ్డపోతారం మున్సిపల్ కాజీపల్లి వార్డు పరిధిలోని ధర్శి చెరువులో కాలుష్య జలాలు తాగడంతో ఎద్దు మృతి చెందిందన్న గ్రామస్తుల ఫిర్యాదుల నేపథ్యంలో పీసీబీ (PCB) అధికారులు మంగళవారం పారిశ్రామికవాడలో పర్యటించారు. చెరువును సందర్శించెందుకు వచ్చిన ఇరిగేషన్ డీఈ రామస్వామి, ఏఈఈ చక్రవర్తి, PCB AES రవీందర్ తో కలిసి సంయుక్తంగా సందర్శనకు వచ్చారు. గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం లేకుండా అలుగును తొలగించడమెంటని ప్రశ్నించే క్రమంలో అధికారులు మధ్యలోనే వెళ్ళిపోయారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఎద్దు మృతికి కారణమైనట్లు అనుమానిస్తున్న కాలుష్య జలాల నమూనాలను గ్రామస్తుల సమక్షంలో PCB అధికారులు సేకరించారు. సేకరించిన కాలుష్య జలాలను ల్యాబ్ కు తరలించి, వాటి నివేదికల ఆధారంగా సంబంధిత పరిశ్రమలపై తగిన చర్యలు తీసుకుంటామని పీసీబీ (PCB) ఎన్విరాన్ మెంట్ సైంటిస్ట్ రవీందర్ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు కాలుష్య ప్రభావంతో మూగజీవాలు మృతి చెంది రైతు కుటుంబాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. కాలుష్య జలాలు వ్యవసాయ క్షేత్రాలు, చెరువులు, కుంటల్లోకి చేరకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత పీసీబీ (PCB) అధికార యంత్రాంగంపై ఉందని గ్రామస్తులు హెచ్చరించారు. బాధ్యులైన పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించి చట్టపరమైన చర్యలు తీసుకొని సీజ్ (క్లోజ్) చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇంద్రసేన, మాజీ కోఆప్షన్ సభ్యుడు వాహబ్, స్థానిక నాయకులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.