హైదరాబాద్ : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి గురువారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం వేదికగా నిర్వహించిన వీడ్కోలు వేడుక అత్యంత ఘనంగా, ఆత్మీయతతో కూడిన వాతావరణంలో సాగింది. సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, తనదైన ముద్ర వేసిన డిజిపి బి. శివధర్ రెడ్డి నిష్క్రమణ సమయంలో సహచర అధికారులు, సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు.
కార్యక్రమ ఆరంభంలో, శివధర్ రెడ్డి తన బాధ్యతలను శాంతిభద్రతల డిజిపి మహేష్ ఎం. భగవత్ కు అప్పగించారు. నూతన డిజిపి గా సి.వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించే వరకు, ఇన్ఛార్జ్ డీజీపీగా మహేష్ భగవత్ వ్యవహరించనున్నారు. అధికారిక బదిలీ ప్రక్రియ అనంతరం, వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన ఐపిఎస్ అధికారులు, సిబ్బంది కి చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ తనను కలిసేందుకు వచ్చిన కరచాలనం చేస్తూ, ఆత్మీయంగా పలకరిస్తూ శివధర్ రెడ్డి ముందుకు సాగారు.అనంతరం పూలతో అలంకరించిన వాహనంపై నిలబడి, అందరికీ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. పోలీసు సంప్రదాయంలో అత్యంత గౌరవప్రదమైన రీతిలో ఐపిఎస్ అధికారులు తాళ్లతో ఆ వాహనాన్ని తాగుతుండగా, ఇతర సిబ్బంది డిజిపి పై పూలు చల్లుతూ కార్యాలయ ప్రధాన ద్వారం వరకు సాగనంపారు. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తమ ప్రియతమ అధికారికి వీడ్కోలు పలుకుతుంటే, ఆ ప్రాంగణం మొత్తం భావోద్వేగంతో నిండిపోయింది. టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, శాంతి భద్రతల డీజీపీ మహేష్ ఎం. భగవత్, టిఎస్ఎల్పిఆర్బి చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయకుమార్ లతో పాటు పలువురు ఐపిఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు సాదర వీడ్కోలు పలికారు. చివరగా, ప్రధాన గేటు వద్దకు చేరుకున్న శివధర్ రెడ్డి అందరి కృతజ్ఞతలను స్వీకరిస్తూ తన వాహనంలో వెళ్లారు.