ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం: మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎట్టి పరిస్థితుల్లోను నిర్దేశించిన లక్ష్యాల మేరకు ముందుకు సాగాలని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఏటా 3,500 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గురువారం నాడు హిమాయత్ నగర్ లోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 శాసనసభ నియోజకవర్గాల ఇందిరమ్మ ఇళ్ల పనుల సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. రెవిన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, లక్ష్మణకుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంపీలు, ఎంఎల్యేలు, ఎంఎల్సీలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ వి.పి గౌతమ్, కలెక్టర్లు, పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని సూచించారు. అటవీ భూములకు సంబంధించిన అంశాలను ఆ శాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఫారెస్ట్ క్లియరెన్సుల కారణంగా ఇళ్ల నిర్మాణం కుంటుపడటానికి వీలు లేదని పేర్కొన్నారు. కలెక్షర్లు తమ విచక్షణాధికారాలను ఉపయోగించి ఫారెస్టు భూముల పరిహారం లాంటి అంశాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు. క్షేత్ర స్థాయిలో కూడా అన్ని విభాగాల అధికారులు సమన్యయంతో పనిచేస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. కలెక్టర్లు నిబంధనల పేరుతో జాప్యం చేయకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. గృహ నిర్మాణాల లక్ష్యాలను చేరుకోలేని అధికారులను ఉపేక్షించేది లేదని శ్రీధర్ బాబు హెచ్చరించారు.